అమరావతి, ఆంధ్రప్రభ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) ప్రసవాలు ఓ ప్రహసనంలా మారింది. రాష్ట్రంలో ఏటా 4.5 లక్షల తొలి ప్రసవాలు జరుగుతున్నాయి. మొదటి సారి గర్భిణులైన మహిళకు సురక్షిత ప్రసవాలను ప్రోత్సహించేందుకు పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పీహెచ్‌సీలో నెలకు సగటున 15 నుంచి 20 ప్రసవాలు జరగాలని లక్ష్యంగా నిర్ణయించారు. అంతకుమించి జరిగినట్లైతే ఆ పీహెచ్‌సీ పనితీరు చాలా బావున్నట్లు గుర్తించి మెరుగైన ర్యాంకింగ్ ఇస్తారు. అత్యధిక శాతం పీహెచ్‌సీలు లక్ష్యానికి దూరంగా ఉంటున్నాయి. నెలలో ఒకటి రెండు ప్రసవాలు మాత్రమే పీహెచ్‌సీల్లో జరుగుతున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కాన్పులు జరగకపోవడం వల్ల టీచింగ్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. తమ వద్దకు వచ్చే ప్రసవాలలో అత్యధికం సాధారణ ప్రసవాలు పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ల స్థాయిలలో చేసినట్లైతే పనిలో వెసులుబాటు ఉండి మరింత కష్టసాధ్యమైన ప్రసవాల పై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వాసుపత్రి సీనియర్ వైద్యుల వాదన.
ఇటీవల పలు పి.హెచ్.సి లను 24/7 గంటల అత్యవసర పీహెచ్‌సీలుగా మార్పు చేశారు. ఇందులో భాగంగా జీవో ఎంఎస్ నెంబర్ 60 ప్రకారం రెండవ మెడికల్ ఆఫీసర్ పోస్టును నియమించారు. 24 గంటలు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది రోగులకు సత్వర సేవల నిమిత్తం అందుబాటులో ఉండాలి అనే లక్ష్యంతో 24 గంటల పి హెచ్ సి లు గా మార్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది.. కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యులతో పాటు సిబ్బంది డ్యూటీ సమయాల్లో ఆసుపత్రుల్లో ఉండకుండా సొంత పనుల్ని చక్కబెట్టుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రి బాట పడుతున్నారనేది బహిరంగ రహస్యం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటలను చోటు చేసుకుంటున్నాయి.
ప్రతి ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలని టార్గెట్ నిర్ణయించిన కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. అర్ధరాత్రి ప్రసవాలకు వస్తే ఏదో సాకుతో దగ్గరలోని పెద్ద ఆస్పత్రులకు సిబ్బంది రిఫర్ చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. తప్పని పరిస్థితులలో వ్యయ ప్రయాసలతో పెద్దాస్పత్రి కు గర్భిణీలు వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. పలుచోట్ల పనిచేస్తున్న మహిళా వైద్యాధికారులు పరపతిని ఉపయోగించే, పైరవీలు చేసో అక్రమ డిప్యుటేషన్ లపై ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దీంతో ఆయా పీహెచ్‌సీల్లో కాన్పులు చేయడం సమస్యగా మారిందని సిబ్బంది వాపోతున్నారు.
కాన్పు కష్టం..
అత్యధికశాతం పీహెచ్‌సీలకు వెళ్ళే గర్భిణీలకు అక్కడి వైద్యులు చెప్పేదేంటంటే ఇక్కడ కాన్పు కష్టం. సిజేరియన్ అవసరం కావొచ్చు. పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తాం. అక్కడకు వెళ్ళండి అని….. సీన్ కట్‌చేస్తే గుంటూరు కాకినాడ ఏలూరు విజయవాడ తిరుపతి నగరాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళిన తరువాత అత్యధిక శాతం అక్కడ సాధారణ కాన్పులే జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రుల్లో ప్రసవాల డేటాను తీసుకొని సంబంధిత తల్లుల్ని కుటుంబ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేసినట్లైతే వాస్తవాలు బయటకు వస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ” రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చొరవ చూపాలి. ప్రతి పీహెచ్‌సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా కచ్చితంగా ప్రయత్నించాల్సిందే. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలని ఇటీవలే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని అధికారుల్ని ఆదేశించారు” పీహెచ్‌సీల్లో కాన్పుల్లో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె నివాస్ దృష్టి సారిస్తే పీహెచ్‌సీల్లో వైద్యుల పనితీరు బట్టబయలవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.