నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామము శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద పల్లవి అనే మూడు సంవత్సరాల చిన్నారి ఆదివారం కిడ్నాప్ అయిన సంగతి తెలిసిందే.కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలిక క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం శ్రీ చాముండేశ్వరీ అమ్మవారి దేవస్థానం వద్ద మూడేళ్ల గిరిజన చిన్నారి కిడ్నాపైన ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనం కలిగించింది. గంగపట్నం శ్రీనివాసపురం సంఘంలో మానికల చిన సూలామయ్య తన భార్య పోలమ్మతో కలిసి నివాసం ఉంటున్నారు. వారికి చార్ముడి, మన్నారి, సూలామమ్మ, పోలయ్య, పల్లవి అనే ఐదు మంది సంతానం. ఆదివారం అమ్మవారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో వారు తమ పిల్లలతో కలిసి అమ్మవారి దేవస్థానం వద్దకు వెళ్లారు. పిల్లలందరూ కలిసి ఆడుకుంటుండగా ఇద్దరు మహిళలు వచ్చి వారికి తినుబండారాలు ఇస్తామని దూరంగా తీసుకువెళ్లారు. అక్కడ తినుబండారాలు ఇచ్చినట్లే ఇచ్చి పల్లవి (3) అనే బాలికను తీసుకుని మధ్యలో ఉంచుకుని ఇద్దరు మహిళలు స్కూటీ తరహా వాహనంలో పరారయ్యారు.
దీంతో ఈ సంఘటన సంచలనం కలిగించింది. జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల్లో పరిశీలించి ఇద్దరు మహిళలు గిరిజన బాలికతో కలిసి అత్యంత వేగవంతంగా వెళ్తున్నట్లు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.