Wednesday, November 20, 2024

చైల్డ్​ మ్యారేజీ ఆగట్లేదు.. గుట్టుగా సాగుతున్న బాల్య వివాహాలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటం లేదు. బాలికల ఉన్నత విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేసినా, వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తామని పాలకులు చెబుతున్నా.. బాల్య వివాహాలు గుట్టుగా కొనసాగుతూనే ఉన్నాయి. చట్టాలు హెచ్చరికలు చేస్తున్నా.. ప్రభుత్వాలు నియంత్రించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. చిన్నారుల జీవితాలతో వారి కుటుంబాలే చెలగాటం ఆడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులతో తల్లిదండ్రులు చిన్నవయసులోనే పెళ్లిళ్లు చేసి, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో గడచిన ఐదేళ్లలో సుమారు 5 వేలకుపైగా బాల్య వివాహాలకు అధికారులు అడ్డుకట్ట వేయగా.. దీనికి రెట్టింపు స్థాయిలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు జరిగినట్లుగా అంచనాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఎవరైనా సమాచారం అందిస్తేనే శిశు సంక్షేమశాఖ అధికారులు బాల్యవివాహాలను అడ్డుకోగలుగుతున్నారు. ఒకవైపు మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ఇంకోవైపు రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారికి బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి.

ఆర్థిక కష్టాలే కారణం..
బాల్య వివాహాలకు ప్రధాన కారణం ఆర్థిక కష్టాలేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకవైపు ఆర్థిక స్థితిగతులు సక్రమంగా లేని పరిస్థితుల్లో కరోనా మహమ్మారి పేద కుటుంబాలపై మరింత ప్రభావం చూపింది. అనేక మంది చిన్నారుల భవిష్యత్తును వివాహాల రూపంలో కాలరాచిందని చెప్పవచ్చు. కుటు-ంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడం, తల్లిదండ్రుల కష్టాలను చూసి, వారి మాట కాదనలేక చిన్నారులు పెళ్లిపీటలపై కూర్చుంటు-న్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు గత రెండేళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు- పాఠశాలలు, కళాశాలలు కరోనా కారణంగా మూతపడటంతో భారీగా బాల్య వివాహాలు జరిగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని ఒక ఉన్నత పాఠశాలలో 29 మంది బాలికలకు వరుసగా వివాహాలు జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

చట్టం అమలు ఎక్కడ?
రాష్ట్రంలో బాల్యవివాహాల నిరోధక చట్టం -2006 పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. బాల్యవివాహాలను అడ్డుకునేందుకు క్షేత్రస్థాయిలో చైల్డ్‌ లైన్‌ కమిటీ లు, జిల్లా బాలల సంరక్షణ యూనిట్లు, బాలల సంరక్షణ కమిటీ లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినా.. ఏదో మొక్కుబడిగా అవి పని చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో గ్రామ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శితోపాటు సచివాలయ మహిళా పోలీసులు బాధ్యులుగా ప్రభుత్వం నిర్ణయించినా.. ఆ దిశగా కార్యాచరణ మాత్రం కనిపించని పరిస్థితి ఉంది. ఇక జిల్లాలు, మండలాలు, గ్రామీణ స్థాయిలో బాల్య వివాహాల నిరోధక కమిటీ-లు పూర్తి స్థాయిలో లేకపోవడంతో బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటున్నాయి. బాల్య వివాహాలపై అంగన్వాడీ సిబ్బంది ద్వారా లేదా మహిళా సహాయ కేంద్రం 181, పోలీసు హెల్ప్‌ లైన్‌ నంబరు 100, టోల్‌ ఫ్రీ నంబరు 1098ల గురించిన ప్రచారం మరింత జరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అధికారులకు ఈ నెంబర్ల ద్వారా అందుతున్న సమాచారం అరకొరగానే ఉంది.

బాల్య వివాహాలతో అనేక దుష్పరిణామాలు
బాల్య వివాహాలతో ఆయా కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అనేక అధ్యయనాలు, సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాలను పరిశీలిస్తే.. 40 శాతం మన దేశంలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో కూడా పెద్ద సంఖ్యలోనే ఉందని స్పష్టమవుతోంది. 2017లో 1204, 2018లో 881, 2019లో 950, 2020లో 1065, 2021లో 1235, ఈ ఏడాది ఇప్పటి వరకు 630 వరకు బాల్య వివాహాలను ఐసీడీఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలను నిలిపివేస్తున్నా.. ఏటా వేల సంఖ్యలో వివాహాలు గుట్టుగా జరుగుతూనే ఉన్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం, మత, కులపరమైన కట్టు-బాట్ల వల్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఇప్పటికే వెల్లడైంది. కనీస అవగాహన లేని వయసులో వివాహాలు చేయటం వల్ల చిన్నారుల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని సామాజిక వేత్తలు, వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం, రక్తహీనత, ఇతర సమస్యల వల్ల ప్రసవ సమయంలో తల్లిd బిడ్డ ఇద్దరూ మరణిస్తున్న సంఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకున్నాయి. ఈ తరహా ఘటనలు గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా నమోదువుతున్నాయి.

చట్టప్రకారం కఠిన చర్యలు..
బాల్య వివాహాలు చేసే వారిపైన, వాటిని ప్రోత్సహించే వారిపైన బాల్య వివాహా నిషేధ చట్టం-2006 ప్రకారం కఠిన చర్యలు తప్పవని మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండక ముందే పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేస్తున్నారు. గతేడాది కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలోనే 165 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు వారు చెబుతున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తామని, అప్పటికీ మాట వినకపోతే కేసు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. బాల్య వివాహాల్ని వ్యతిరేకించి, తల్లిదండ్రులతో విభేదించే బాలికలను పునరావాస కేంద్రాల్లో ఉంచి చదువు, ఉపాధి కల్పన ఏర్పాట్లు- చేస్తామని చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement