Friday, November 22, 2024

గుడ్డు తిని చిన్నారి మృతి – రూ.8 ల‌క్ష‌లు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని హైకోర్టు ఆదేశం..

చిత్తూరు – గుడ్డు తిని చిన్నారి మృతి చెందడం కేసులో బాధిత కుటుంబానికి రూ .8 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఎపి హైకోర్టు ఆదేశించింది.. వివ‌రాల‌లోకి వెళితే గత ఏడాది కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్డు తిని చిన్నారి మృతి చెందింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన మానవ హక్కుల సంఘం బాధిత కుటుంబానికి రూ.8లక్షల పరిహారం ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్, అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాలపై అధికారులు హైకోర్టుకు వెళ్లడంతో మానవహక్కుల సంఘం నిర్ణయం సరైనదేనని సమర్థించింది చిన్నారి మరణం మానవ తప్పిదంగానే ధర్మాసనం పేర్కొంది.


అసలేం జరిగిందంటే.. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరిలో కోడిగుడ్డు తిని అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్న ఓ చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూసింది. కుళ్లిన కోడిగుడ్డు పెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ఉదయం పిల్లలకు టీచర్‌ కోడిగుడ్లు ఇచ్చారు. కాసేపటికే దీక్ష అనే చిన్నారి వాంతులు చేసుకుంది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పాప మరణించినట్లు వెద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై అంగన్‌వాడీ టీచర్‌ను వివరణ కోరగా తాము సరఫరా చేసిన గుడ్లు బాగానే ఉన్నాయన్నారు. ఈ ఘటన గురించి పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్‌ఆర్‌సీ విచారణ జరిపింది. చిన్నారి తల్లిదండ్రులు సరిత, మురేగేష్‌లకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ఈ ఏడాది జనవరి 31న తీర్పు ఇచ్చింది. ఆ సొమ్మును చెల్లించాలని అంగన్‌వాడీ టీచర్, కుప్పం తహసీల్దార్, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ తదితరులను ఆదేశించింది. మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలపై అధికారులు హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు.. పరిహారం విధించడం సరైనదే అని పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement