పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. అందులో భాగమే జగనన్న కాలనీలని, భవిష్యత్తులో అవి ఆదర్శ నగరాలుగా మారనున్నాయని వెల్లడించారు. ప్రతి పేదవాడికీ స్థిరాస్తిగా సొంతింటిని అందజేయడమే ప్రభుత్వం సంకల్పమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు పేదలందరికీ ఇళ్లు అందించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరంతోపాటు పలు చోట్లు నిర్మిస్తున్న జగనన్న సంపూర్ణ గృహ లే అవుట్లలో చేపట్టిన జగనన్న కాలనీల లేఅవుట్లను మంత్రి శుక్రవారం సందర్శించారు. పైడిభీమవరంలో జగనన్న కాలనీని పర్యటించిన ఆయన నూతన గృహాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జగనన్న కాలనీలో చేపడుతున్న నిర్మాణాలపై ఆరా తీసిన మంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరంలో 2.31 ఎకరాల్లో నిర్మిస్తున్న 84 ప్లాట్లు గల జగన్న కాలనీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటికే 59 ప్లాట్లు గ్రౌండింగ్ కాగా మిగిలినవి భూమిపూజ పనులు పూర్తి అయి వివిధ స్థాయిలలో నిర్మాణాలు జరుగుతున్నాయని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు ఎన్.గణపతి మంత్రికి వివరించారు. కాలనీలో నిర్మాణం పూర్తి అయిన గృహాలను పర్యటించి లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించారు. తదుపరి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 17 వేల పైచిలుకు జగనన్న లేఅవుట్ల ద్వారా 32 లక్షల మందికి ఇళ్లు అందిస్తున్నామని, అన్ని చోట్లా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిర్మాణాలకు సంబంధించిన సామగ్రిని లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామని, సుమారు రూ.750 కోట్ల బిల్లులు ఇప్పటి వరకు అయిన పనులకు మంజూరు చేశామని చెప్పారు.
మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.32 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే లోగా ప్రతి కాలనీలో హెల్త్ సెంటర్, సచివాలయం, అంగన్వాడీలు, పాఠశాలలు, ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఇళ్లు మంజూరు కానివారు ఎవరైనా సొంత స్థలం కలిగి ఉంటే వెంటనే ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఒక యజ్ఞంలా ఈ ప్రక్రియను కొనసాగించి ఉగాది నాటికి శతశాతం పనులు ప్రారంభయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇళ్ల నిర్మాణాలపై కొందరు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. సభలో పలువురు లబ్ధిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లో గృహం మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం మండలం అంపోలు గ్రామంలో 1134 ప్లాట్లు 24.60 ఏకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్ కుమార్ ఇరత ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.