Thursday, September 19, 2024

Cheetah Hunt – రాజమండ్రిలో చిరుత భయం … బోనుకు చిక్కదు..

థర్మల్ డ్రోన్ లతో గాలింపు
పాద‌ముద్ర‌లు గుర్తించిన అధికారులు
చిరుత‌ను ప‌ట్టుకునేందుకు మ‌రిన్ని బోన్లు ఏర్పాటు
ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అటవీశాఖ అధికారుల సూచ‌న‌

ఆంధ్రప్రభ స్మార్ట్, రాజమండ్రి : చిరుత భ‌యంతో రాజమండ్రి జనం బిక్కుబిక్కుమంటున్నారు. అదిగో చిరుత.. ఇదిగో చిరుత కబుర్లు జనాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి.. ప‌లు మార్లు ట్రాప్ కెమెరాలో క‌నిపించినా.. బోనుకు మాత్రం చిక్కటం లేదు. అయిదు రోజులుగా చిరుత జాడను కనిపెట్టి జనం జంగిల్ నుంచి తప్పించటాని అటవీ శాఖ అధికారులు సతమతం అవుతున్నారు. ఈ చిరుత తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్ చెరువు అభయారణ్యంలోనే సంచరిస్తోందని ఫారెస్టు ఆఫీసర్లు నిర్ధారించారు.

- Advertisement -

చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు ముమ్మ‌రం చేశారు. రెండు సార్లు ట్రాప్ కెమెరాకు చిక్కింది. దీని కదలికల ఆధారంగా ట్రాప్ కెమెరాలను, బోన్లను వేర్వేరు ప్రదేశాలకు మారుస్తున్నారు. చిరుత సంచార దృశ్యాలు కెమెరాకి చిక్కాయ‌ని జిల్లా అటవీశాఖాధికారి ఎస్.భరణి తెలిపారు. పాదముద్రలను సైతం గుర్తించామని, చిరుత‌ కదలికలను గుర్తించేందుకు సీసీ, ట్రాప్ కెమెరాలను మరికొన్ని ప్రదేశాల్లో అమర్చినట్టు తెలిపారు. జనావాసాల్లో ఈ చిరుత సంచరిస్తున్నట్లు ఆధారాలు లభించలేదన్నారు.

తెరమీదకు థర్మల్ డ్రోన్..
చిరుత సంచారాన్ని సాధారణ డ్రోన్ సహాయంతో గాలించినప్పటికీ జాడ కనపడలేదని అధికారులు చెబుతున్నారు. ఇక థర్మల్ డ్రోన్ సాయంతో చిరుత జాడ గుర్తించేందుకు ప్రయత్నిస్తామన్నారు.థర్మల్ డ్రోన్ రాత్రిపూట సైతం సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా చిరుతపులి జనావాసాల్లోకి రావడం తక్కువని అధికారులు చెబుతున్నారు. ఎవరికైనా చిరుత ఎదురుపడితే పరిగెత్తవద్దని, అలాగే నిలబడి చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి నడవాలన్నారు. భయపడి పొదల మాటున నక్కి కూర్చుంటే జంతువు అని దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement