గిద్దలూరు, (ప్రభ న్యూస్) : కట్టెల కోసం అడవికి వెళ్లిన ఓ యువకుడిపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. గిద్దలూరు ఆటవీరేంజ్ పరిధిలోని అంబవరం బీట్ లో ఇవ్వాల (సోమవారం) చోటుచేసుకుంది. గిద్దలూరు మండలంలోని దిగువమెట్టకు చెందిన పులిచెర్ల ఈరన్న మరో వ్యక్తితో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అక్కడ పొదలచాటున ఉన్న చిరుతపులి ఒక్కసారిగా ఈరన్నపై దాడి చేయగా అతను కేకలు వేశాడు.
సమీపంలోని వ్యక్తి గట్టిగా కేకలు వేస్తూ రావడంతో చిరుత పారిపోయింది. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు గాయపడిన ఈరన్నను గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈరన్న కుడిచేతిపై, పొట్టపై చిరుత గాయపరిచింది. అటవీశాఖ అధికారులు వివరాలు సేకరించారు. అంతేకాకుండా దిగువ మెట్ట చెంచుకాలనీకి చెందిన బాలుడిపై కూడా చిరుతపులి దాడి చేసినట్టు తెలుస్తోంది. గాయాలైన బాలుడిని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.