అమరావతి, ఆంధ్రప్రభ : చెడ్డీ గ్యాంగ్.. పేరు వింటేనే భయం.. ఈ గ్యాంగ్ కదలికలను సీసీ కెమేరా పుటేజీల్లో చూస్తే వణుకు పుడుతుంది.. ఇక నేరుగా చూస్తే గుండె ఆగిపోవాల్సిందే.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఈ చెడ్డీ గ్యాంగ్ తెలంగాణాలో అడుగుపెట్టాక హైదరాబాద్ శివారు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇప్పుడీ చెడ్డీ గ్యాంగ్ మన రాష్ట్రంలో హడలెత్తిస్తోంది. గత మూడేళ్ళుగా ఈ కరుడు గట్టిన నేరగాళ్ళ ముఠా అర్ధరాత్రులు వివిధ జిల్లాల్లో సంచరిస్తూ పలు నేరాలకు పాల్పడింది.
ముఖ్యంగా తిరుపతి, రాయలసీమ జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఈ గ్యాంగ్ కదలికలు గతంలోనే పోలీసు యంత్రాంగం గుర్తించింది. అప్పట్లో గుంటూరు జిల్లా తాడేపల్లి, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో పెద్ద నేరాలకు పాల్పడిన ఈ ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా చెడ్డీ గ్యాంగ్ నేరగాళ్ళుగా ధృవీకరించారు. ఇలా రాష్ట్రంలో సం చలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోసారి రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
తిరుపతి జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించిన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ సంచారంపై నిర్దారణకు వచ్చారు. దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఈ ముఠా చుట్టు ప్రక్కల జిల్లాల్లో మకాం వేసే అవకాశం ఉందని, మరోవైపు ఈ ముఠాకు చెందిన గ్యాంగులు ఇప్పటికే వివిధ జిల్లాల్లో అడుగు పెట్టినట్లు అనుమానిస్తున్నారు.
గతంలో వీరి కదలికలు ఉన్న జిల్లాల్లో వారు తల దాచుకున్నట్లు భావిస్తున్న ప్రాంతాలను మరోసారి జల్లెడ పట్టనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా చలికాలంలో పంజా విసిరే ఈ చెడ్డీ గ్యాంగులు ఈ సీజన్ వాతావరణం వారికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. త్వరగా చీకటిపడటం, ప్రజలు త్వరగా నిద్రించడం, చలికారణంగా గ్రామాలు, శివారు ప్రాంతాల్లో అంతగా జన సంచారం లేకపోవడం వంటివి ఈ నేరగాళ్ళకు కలిసి వచ్చే అంశాలు.
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ క దలికలను నిర్ధారించిన ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇంటి కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు కొట్టినా తెరవకూడదని సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తారపసడితే వెంటనే డయల్ 100కి కాల్ చేయాలని, సమీపం లోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరికలు జారీ చేశారు.
మూడేళ్ళుగా పాగా..
రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ మూడేళ్లుగా పాగా వేసింది. అంతకుముందు ఎన్నడూ రాష్ట్రంలో వినపడని ఈ పేరు ప్రస్తుతం హెడలెత్తిస్తోంది. తాజాగా తిరుపతిలో ఈ ముఠా సంచారాన్ని గుర్తించగా తొలిసారి 2021లో తిరుపతిలొనే వీరి ఆనవాళ్ళు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఈ గ్యాంగ్‌ఒ విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేసింది. గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన కాలనీలో గోడదూకి ఓ ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడింది.
తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ గ్యాంగ్ నేరాలకు పాల్పడుతుందని, ఒకవేళ అనుకోకుండా ఎవరైనా వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా, ప్రతిఘటించినా అత్యంత క్రూరంగా వ్యవహరిస్తారని పోలీసులు చెబుతున్నారు. చోరీకి పాల్పడే ముందు వివిధ వేషాల్లో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్ళను గుర్తించి రెక్కీ నిర్వహిస్తారు. చోరీకి పాల్పడే ముందు ఇంట్లోకి చొరబడి కరెంటు నిలిపి వేయడం వీరు ప్రధానంగా అనుసరించే ఫార్ములా అని పోలీసులు చెబుతున్నారు. చేతిలో ఇనుప రాడ్డు పట్టు-కుని సంచరిస్తూ వాటితో చాకచక్యంగా తాళాలు తొలిగించి నేరాలకు పాల్పడతారు.
తాజాగా సీసీ కెమేరాల్లో..
తాజాగా తిరుపతిలో మళ్ళీ అడుగు పెట్టిన చెడ్డీ గ్యాంగ్ రెండు నేరాలకు పాల్పడే యత్నం చేసింది. ఇదం తా సీసీ కెమేరాల్లో రికార్డయింది. ఈ దృశ్యాలను విడుదల చేసిన పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గత మూడు రోజుల క్రితం ఈ చెడ్డీ గ్యాంగ్ ఆటోనగర్‌లోని మారుతి షో రూంలో చోరీకి ప్రయత్నించింది.రెండు రోజుల క్రితం అర్ధారాత్రి ఈ గ్యాంగ్ తిరుపతి రూరల్ మండలం, చెర్లోపల్లి దగ్గర ఉన్న శ్రీవారి విల్లాస్ నెంబర్ 31లోకి చొరబడి చోరీకి యత్నించింది.
నిఘా పటిష్టం..
తిరుపతిలో అడుగుపెట్టిన చెడ్డీ గ్యాంగ్ ఇప్పటికే రెండు చోరీలకు విఫలయత్నం చేసింది. దీంతో పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పటిష్టం చేసింది. తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించిన పోలీసులు గతంలో రాష్ట్రంలో వివిధ చోట్ల నేరాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ ముఠాకు చెందిన వేలిముద్రలతో పొల్చి చూస్తున్నారు.
అదేవిధంగా ఇటీవల జరిగిన వివిధ నేరాల్లో పట్టుబడిన నేరగాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కొందరు వ్యక్తులు చెడ్డీ ధరించి కర్రలు, కత్తులు పట్టు-కొని సంచరిస్తున్నట్లు- అధికారుల స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12 నుంచి 5 గంటల మధ్యలోనే చెడ్డి గ్యాంగ్ ఆపరేషన్ మొదలవుతుంది.