Wednesday, November 20, 2024

Vizag | ప్రత్యామ్నాయ పంటలతో గంజాయికి చెక్ పెట్టండి : కలెక్టర్ దినేష్

ఏఎస్ఆర్ జిల్లా, పాడేరు : గంజాయి నివారణకు రైతులకు ప్రత్యామ్నాయ పంటలను అందించి జిల్లాలో గంజాయికి చెక్ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎన్.దినేష్ కుమార్ స్పష్టం చేసారు. గంజాయి సాగు వలన సమాజానికి కలిగే చేటుపై గిరిజనులను చైతన్యవంతం చేయాలని సూచించారు.

కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, ఐసిడిఎస్, విద్యాశాఖ, ద్వమా, పోలీస్, డి. ఆర్. డి. ఏ వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖ అధికారులతో గంజూయి నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై సోమవారం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

- Advertisement -

గంజాయి నిర్మూలనపై ప్రభుత్వశాఖల వారీగా గ్రామాలలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గత నెలలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై చైతన్య కార్యాక్రమాలు అవగాహనా సదస్సులు నిర్వహించాలని సూచించారు.

గంజాయి నిర్మూన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉందన్నారు. కళాశాలల్లో అవగాహనా సదస్సులు, డి ఎడిక్షన్ సెంటరుకు ఎంత మంది వచ్చారని సంబంధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా స్వయం సహాయ సంఘాల సమావేశాల్లో గంజాయి సాగు నిర్మూలనపై చర్చించాలని సూచించారు.

గంజాయి సాగు వినియోగం, అక్రమ రవాణాపై 9381 123 100 ఫోన్ నంబరుకు ప్రజలు సమాచారం అందించాలని చెప్పారు. గంజాయి సాగు, రవాణాపై సమచారం అందిస్తే నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2241 మంది రైతులకు 400 టన్నుల రాజ్మా విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

గంజాయి వినియోగిస్తే జీవితాలు నాశనం అయిపోతాయని అన్నారు. యువత గంజాయి వినియోగానికి దూరంగా ఉండాలని అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 153 గ్రామాల్లో గంజాయి సాగు ఫై సర్వే చేయడం జరిగిందన్నారు. వివిద ప్రభుత్వ శాఖల్లో 34 ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసామన్నారు. బ్యాంకులలో పెద్ద ఎత్తున నగదు లావా దేవీలు జరిగితే బ్యాంకు అధికారులు పరిశీలించి సమాచారం అందించాలని సూచించారు.

జిల్లా సరిహద్దులో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గంజాయి సాగు చేసే రైతులు, సరఫరాదారులుపై ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. గంజాయి విడిచి పెట్టిన రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, స్వయం ఉపాధి పథకాలు, బ్యాంకు రుణాలు, పశువులు, మేకలను మంజూరు చేయాలని స్పష్టం చేసారు. జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ్, జిల్లా ఉద్యాన వన అధికారి రమేష్ కుమార్ రావు, గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి ఉప సంచాలకులు ఎల్. రజని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జమాల్ భాషా, డి. ఆర్. డి.ఏ. పి.డి వి. మురళి, ఐసిడిఏస్ పి.డి సూర్యలక్ష్మి వివిద శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement