అమరావతి, ఆంధ్రప్రభ: ఆలయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం విజిలెన్స్ అస్త్రం సిద్ధం చేస్తోంది. దేనాదాయశాఖలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహా విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం ఏర్పాటుపై ఉన్నత స్థాయిలో కసరత్తు జరగుతోంది. కొద్ది రోజుల కిందట దేవదాయశాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సైతం విజిలెన్స్, సెక్యూరిటీ ఏర్పాటుపై చర్చించారు. టీటీడీలో విజిలెన్స్, సెక్యూరిటీ పనితీరు, అధికారులు, సిబ్బంది తదితర విధివిధానాలు అధ్యయనం చేసేందుకు తొందరలోనే ప్రత్యేక బృందాన్ని పంపనున్నారు. టీటీడీ ఆలయాల భద్రత, క్యూలైన్లు, ఇతర ఆస్తుల పర్యవేక్షణకు పటిష్టమైన విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పని చేసే విజిలెన్స్ విభాగం రోజు వారీ కార్యకలాపాలతో పాటు అవకతవకలను ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది. ఇదే తరహాలో దేవదాయశాఖలో కూడా విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం ఏర్పాటుపై కొంత కాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హిందూ ఆలయాలు ప్రధానంగా భద్రతా సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇదే సమయంలో భక్తులు, దాతలు ఆశయాలకు విరుద్ధంగా ఆలయాల్లో పలు అవకతవకలు జరగుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. కొందరు చేసే చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినడమే కాక మఠ, పీఠాధి పతులు సైతం ఆలయాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలంటే విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం అవసరం ఉందనే అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది.
భద్రతకు పెద్దపీట..
రాష్ట్రంలోని పలు ఆలయాల్లో భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతున్న నేపధ్యంలో విజిలెన్స్ భద్రత అంశం తెరపైకి వచ్చింది. గత రెండేళ్లలో అనేక ఆలయాలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడమే కాక విగ్రహాలను సైతం విగ్రహాలను సైతం ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం రథం, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల రథంలో వెండి సింహం, రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం సహా రాష్ట్రవ్యాప్తంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయా ఘటనలపై హిందూ సంస్థలు, భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని చోట్ల రాజకీయ వివాదాలకు కూడా వీటిని వినియోగించుకొని ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు ప్రయత్నించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆలయాల భద్రతకు పటిష్టమైన వ్యవస్థ ఉండాలని భావించిన ప్రభుత్వం టీటీడీ తరహా విజిలెన్స్‌పై దృష్టిసారించింది. టీటీడీ విజిలెన్స్ విభాగం ఒక్క తిరుమల భద్రతనే కాక దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, అనుబంధ ఆలయాల భద్రతను పర్యవేక్షిస్తుంది. ఆలయాల్లో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం పహరా కాస్తూ వివాదాలకు ఆస్కారం లేకుండా చూస్తోంది.
ఆదాయానికి గండి..
రాష్ట్రంలోని పలు ఆలయాల్లో టిక్కెట్ల రీ సైక్లింగ్ ఆలయ ఆదాయానికి గండికొడుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. పేరొందిన ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాల్లో ఆలయ ఉద్యోగులు, అధికారులు చేతివాటం చూపుతూ టిక్కెట్ల రీసైక్లింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో టిక్కెట్ల రీ సైక్లింగ్, నకిలీ టిక్కెట్ల చెలామణి వెలుగులోకి వచ్చాయి. మరికొన్ని ఆలయాల్లో సైతం ఇదే తరహా విమర్శలు వెల్లువెత్తాయి. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ నిర్వహించడం మినహా భవిష్యత్‌లో చోటు చేసుకోకుండా చూడటంలో దేవదాయశాఖ ఉన్నతాధికారులు విఫలమయ్యారు. వీటికి విజిలెన్స్ చెక్ పెడుతుందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. టీటీడీలో దళారులు, ఉద్యోగులు సహా ఏ ఒక్కరు టిక్కెట్లు దారి మల్లించినా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి అరెస్టులు చేస్తున్నారు. పలువురిపై కేసులు నమోదు చేయడంతో పాటు వ్యవస్థీకృత ముఠాలు, ఆలయ ఉద్యోగులపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో దీనిని అమలు చేస్తే ఆదాయానికి గండిపడే అవకాశం ఉండదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.
ఆస్తులకు రక్షణ..
రాష్ట్రంలోని పలు ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది సహకారంతో కొందరు వ్యక్తులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వచ్చి ఖాళీ చేయించేందుకు చేసే ప్రయత్నాలను కోర్టులకు వెళ్లి కబ్జాదారులు అడ్డుకుంటున్నారు. ఏళ్ల తరబడి కోర్టు కేసుల్లో ఉండటం, అధికారుల మార్పు తదితర పరిణామాల నేపధ్యంలో దాతలు ఇచ్చిన ఆస్తులు అనర్హుల చేతుల్లోకి వెళుతున్నాయి. విజిలెన్స్ నిఘాను పటిష్టం చేసిన పక్షంలో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైతే క్రిమినల్ కేసుల నమోదుకు కూడా వీలుంటుందని ప్రభుత్వం యోచిస్తోంది.
అధ్యయనం..
టీటీడీ విజిలెన్స్ విధి విధానాలపై ప్రత్యేక బృందాన్ని పంపి అధ్యయనం చేయనున్నారు. అధికారులు, ఉద్యోగుల నియామకం, జీత భత్యాలు తదితర అన్ని అంశాలను పరిశీలించనున్నారు. తదనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు చెపుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..