Wednesday, November 27, 2024

AP | విదేశీ బంగారానికి చెక్‌.. సన్నద్ధమవుతున్న ఏపీ కస్టమ్స్‌

అమరావతి, ఆంధ్రప్రభ: అక్రమ మార్గాల్లో విదేశీ బంగారం దిగుమతి..ఆపై గుట్టు చప్పుడు కాకుండా జ్యుయలరీ షాపుల్లో అమ్మకాలు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతూ స్మగ్లర్లు చెలరేగుతున్నారు. పొరుగు దేశాల నుంచి మూడో కంటికి తెలియకుండా దేశానికి తెచ్చి బహిరంగ మార్కెట్‌లో చెలామని చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్న ముఠాలపై ఉక్కు పాదం మోపేందుకు ఏపీ కస్టమ్స్‌ కమిషనరేట్‌(ప్రివెంటివ్‌) అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

చెన్నై కేంద్రంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్‌లో మూడంచెల వ్యవస్థను ఛేదించేందుకు సిద్ధమవుతున్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేసిన అధికారులు..ఇప్పటికే కొందరి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటీవల బంగారం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. చెన్నై నుంచి వివిధ మార్గాల్లో ఏపీలోని పలు షాపులకు స్మగ్లింగ్‌ బంగారం చేరుతోంది.

- Advertisement -

కస్టమ్స్‌ సుంకాల ఎగవేత, జీఎస్టీ చెల్లించకుండా పెద్ద ఎత్తున సాగుతున్న బంగారం అమ్మకాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. అప్పుడప్పుడు అధికారులు చేస్తున్న దాడుల్లో రూ.కోట్ల విలువైన బంగారం పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. పట్టుబడిన బంగారం స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు.

అధికారులు స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బంగారం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలంటే మూలాలను ఛేదించాల్సిందేననే అభిప్రాయానికి కస్టమ్స్‌ అధికారులు వచ్చారు. ఆ దిశగా ప్రాథమిక సమాచారం సేకరించిన అధికారులు..రానున్న రోజుల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసి స్మగ్లర్ల పీచమణిచేందుకు సిద్ధమవతున్నారు.

చెన్నై కేంద్రంగా..

చెన్నై కేంద్రంగా దేశంలోకి స్మగ్లింగ్‌ బంగారం వస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దుబాయ్‌ తదితర అరబ్బు దేశాల నుంచి శ్రీలంకకు స్మగ్లింగ్‌ బంగారం చేరుతోంది. అక్కడి నుంచి సముద్ర మార్గంలో చెన్నైకి స్మగ్లర్లు చేరవేస్తున్నారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో కస్టమ్స్‌ నిఘా పటిష్టం చేశారు. బంగారం ఏ రూపంలో తీసుకొచ్చినా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అధికారులు గుర్తిస్తున్నారు.

అది వస్తువుల మధ్యలో పెట్టి తెచ్చినా..బంగారం కరిగించి ద్రవ, ఘన రూపాల్లో తీసుకొచ్చినా ఇట్టే అధికారులు పసిగడుతున్నారు. ఇటీవల అధికారుల దృష్టి అంతగా ఉండకపోవచ్చని భావించిన ముంబై స్మగ్లర్లు గన్నవరం విమానాశ్రయాన్ని ఎంచుకున్నారు. మైనపు ముద్దలో బంగరాం నిక్షిప్తం చేసి వ్యక్తుల ప్రైవేటు పార్టులో పెట్టి తీసుకొచ్చినప్పటికీ కస్టమ్స్‌ కళ్లుగప్ప లేకపోయారు.

గన్నవరం నుంచి సురక్షితంగా బయటపడితే రోడ్డు మార్గంలో ముంబై వెళ్లాలనే స్మగ్లర్ల ఆలోచనకు ఆదిలోనే అధికారులు అడ్డుకట్ట వేశారు. కస్టమ్స్‌ పటిష్టంతో స్మగ్లర్లు ప్రత్యమ్నాయంగా సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో నాటు పడవలు, ఇతర రవాణా సదుపాయాలు ఉపయోగించుకొని స్మగ్లింగ్‌ బంగారాన్ని చెన్నైకి చేర్చుతున్నారు. అక్కడి నుంచి దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు స్మగ్లింగ్‌ బంగారాన్ని తరలిస్తున్నారు.

మూడంచెల్లో స్మగ్లింగ్‌..

బంగారం స్మగ్లింగ్‌లో మూడంచెల వ్యవస్థ సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసే వ్యవస్థీకృత ముఠా చెన్నైలో ఉంది. స్మగ్లింగ్‌ బంగారం వచ్చిన వెంటనే చెన్నైలో విదేశీ ముద్రలను సాంకేతికతను వినియోగించి తొలగిస్తున్నారు. వీరి ద్వారా నెల్లూరు కేంద్రంగా అక్రమ వ్యాపారం సాగించే మధ్యవర్తుల వద్ధకు బంగారం చేరుతుంది. వీరే షాపుల నిర్వహకులతో ముందస్తు ఒప్పందం చేసుకొని కొరియర్ల ద్వారా చేర వేస్తున్నారు.

సరుకు తీసుకెళ్లే కొరియర్లకు కూడా సరుకు ఎవరు పంతున్నారనేది తెలియదు. ఇందుకోసం ప్రత్యేక ముఠాలు ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఒకసారి వెళ్లిన కొరియర్‌ను మరోసారి అదే ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపరని తెలిసింది. అందుకే పాత్రధారులు మినహా సూత్రధారులు వెలుగులోకి రావడం లేదు. ఇప్పటి వరకు అధికారుల దాడుల్లో పట్టుబడేది కొరియర్లే తప్ప అటు స్మగ్లర్లు, ఇటు అక్రమ వ్యాపారులు చిక్కడం లేదు. దీంతో షాపుల నిర్వహకులు వెలుగులోకి రావడం లేదు.

ఇటీవల గుంటూరు జిల్లా కాజా టోల్‌ ప్లాజా సమీపంలో నెల్లూరుకు బస్సులో వెళుతున్న ఓ వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా..చివరకు ఎక్కడికి చేరవేసింది మాత్రమే చెప్పాడు తప్ప ఎవరు పంపారనేది చెప్పలేకపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ సమాచారం ఆధారంగానే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక జ్యుయలరీ షాపుపై కస్టమ్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది.

కట్టడికి ప్రణాళికలు..

రాష్ట్రంలో అక్రమ బంగారం కట్టడికి కస్టమ్స్‌ అధికారులు సన్నద్దమవుతున్నారు. రోజుకు రూ.కోట్ల విలువైన విదేశీ బంగారం ఏపీ వ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు గుర్తించిన నేపధ్యంలో ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. కొరియర్‌ వ్యవస్థతో సరిపెట్టకుండా బంగారం స్మగ్లింగ్‌ ముఠాల ఛైన్‌ లింక్‌ సిస్టమ్‌ను ఛేదించేందుకు నిర్ణయించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సాధు నరసింహారెడ్డి ఏపీ కస్టమ్స్‌ కమిషనరేట్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

గతంలో ఈ తరహా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఇప్పుడు రెండు బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహారెడ్డి స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే ఇతర కస్టమ్స్‌ కమిషనరేట్ల నుంచి సహకారం తీసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement