తుని : గంజాయి రవాణా కు చెక్ పెట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా తుని పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విశాఖ ఏజెన్సీ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు గంజాయి రవాణా చేసేందుకు స్మగ్లర్లు తుని వరకు వాహనాల్లో తరలించి, ఇక్కడ నుంచి రైళ్లలో సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గంజాయి రవాణా ను పూర్తిగా నిరోధించడంతో పాటు, ఏజెన్సీ ప్రాంతంలో పండిస్తున్న గంజాయి పంటను నాశనం చేసేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి రవాణా నిరోధించేందుకు తుని పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, లారీలు, అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బస్ కాంప్లెక్స్ లో ప్రయాణికుల బ్యాంకులు సైతం చెక్ చేస్తున్నారు. రైల్వే పోలీసులు కూడా రైల్వేస్టేషన్లో ప్రయాణికుల బ్యాగులను చెక్ చేయడంతో పాటు, కదులుతున్న రైళ్ల భోగిలలో సైతం ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేస్తున్నారు.
గత నెలలో పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు తుని పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే గంజాయి తుని మీదుగానే రవాణా అవుతుందని భావిస్తున్న పోలీసు యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను కూడా వినియోగిస్తున్నారు. లాడ్జి లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాడ్జి యజమానులతో పోలీసులు సమావేశం నిర్వహించి హనుమంతు లకు రూములు ఇవ్వవద్దని, అటువంటి వారు ఎవరైనా వస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనప్పటికీ గంజాయి రక్షణను అరికట్టేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.