Friday, November 22, 2024

గంజాయి, అక్రమ మద్యంకు చెక్ : రవికుమార్‌

గంజాయి, మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం గూడూరు రెండో పట్టణంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం, గంజాయి, అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ రవికుమార్‌ మాట్లాడుతూ… రాష్ట్రంలో స్పెషల్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తూ ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అనేక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారని వెల్లడించారు. అందులో భాగంగా చిల్లకూరు, గూడూరు రూరల్‌ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్‌ఈబీ అధికారులు 480 క్వార్టర్‌ బాటిళ్ల కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం, 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ మార్కెట్‌లో సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని కూడా సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు. అక్రమ మద్యానికి సంబంధించి చిల్లకూరు మండల పరిధిలోని భూదానం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ రమేష్‌, గూడూరు పట్టణ దివి పాలెం ప్రాంతానికి చెందిన శ్రీనివాసులును అరెస్టు చేయడం జరిగిందని వెల్లడించారు. చిల్లకూరు మండలం పరిధిలోని జాతీయ రహదారి భూదానం టోల్‌ ప్లాజా వద్ద అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 12 కేజీల గంజాయిని తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తుండగా గుర్తించడం జరిగిందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రం మధురై ప్రాంతానికి చెందిన దినేష్‌ కుమార్‌ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ విజయ్‌ కుమార్‌, సిబ్బంది, తదితరులు ఉన్నారు.


28 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురు అరెస్టు :
ఎస్‌ఈబీ జేడీ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు మంగళవారం ఇంటెలిజెన్స్‌ బృందం బూదనం టోల్‌ ప్లాజా వద్ద బస్సు తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఇబ్రహీంపట్నం నుంచి తిరుపతికి వెళ్లే ఆర్టీసీ బస్సులో 28 కిలోల గంజాయిని గురించిన అధికారులు ఎం.రాజు, ఏ. ఈశ్వరన్‌, బి.గీత అనే ముగ్గురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు రూ.5 వేలు నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement