పేద ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఆహార పంపిణీ విధానం క్రింద అందిస్తున్న చౌక బియ్యం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా దుర్వినియోగమౌతున్నాయి. మరే రాష్ట్రంలోనూ లేని స్థాయిలో ఈ రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది టన్నుల బియ్యం విదేశాలకు ఎగుమతౌతోంది. ఇందులో అధిక భాగం కాకినాడ డీప్‌వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టులనుంచే ఎగుమతి సాగుతోంది. ఇలా వెళ్తున్న బియ్యంలో 99శాతానికి పైగా ప్రభుత్వం పేదలకిస్తున్న చౌక బియ్యమే. ఇవి ఏమాత్రం నాణ్యత కలిగిన బియ్యం కాదు. ప్రజలు నేరుగా వీటిని తినేందుకు ఇష్టపడ్డంలేదు. ముక్కిపోయి, రంగుమారి, ఉబ్బిపోయి ఉంటున్న బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. వీటిని తినలేని వినియోగదార్లు మధ్యవర్తుల ద్వారా తిరిగి అమ్మేస్తున్నారు. రాష్ట్రంలోని గోదావరి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఇప్పుడిది కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది.
ఈ బియ్యాన్ని రైస్‌మిల్లుల్లో రీసైకిల్ చేసి సానబడుతున్నారు. వీటికి పాలీష్ పెట్టి తెల్లగా మారుస్తున్నారు. సన్నబియ్యం తరహాలో తీర్చిదిద్దుతున్నారు. వీటిని ఆఫ్రికా దేశాలకు కాకినాడ రేవుల్నుంచి ఎగుమతులు చేస్తున్నారు. దీంతో గోదావరిజిల్లాల్లో ఇప్పుడు రైస్‌మిల్లులకు ధాన్యాన్ని మరాడించే వ్యాపారం కంటే చౌక బియ్యానికి సానబెట్టే వ్యాపారమే ప్రధానంగా మారింది. అంతేకాదు.. కొన్ని జిల్లాల్లో ఏకంగా రీసైక్లింగ్ యూనిట్లను నెలకొల్పారు. ఓ వైపు ప్రభుత్వం ఏటా వేల కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తూ చౌక బియ్యాన్ని పేదలకందిస్తోంది. కొందరికి ఉచితంగా, మరికొందరికి కిలో రూపాయి ధరపై రాష్ట్రంలో ఏటా 40లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అయితే ఇదందా కొందరు ఎగుమతిదార్లకు ఆర్ధికవరంగా మారుతోంది.
ఇందుకు ప్రధాన కారణం వినియోగదార్లు తినలేని బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయడమే. దీన్ని గుర్తించిన జగన్ కొన్నాళ్ళ క్రితం పేదలకు ప్రభుత్వమందించే బియ్యం నాణ్యతను పెంచాలని నిర్ణయించారు. డిపోల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నారు. ఆ జిల్లాలో సన్నబియ్యం పంపిణీని ముఖ్యమంత్రే స్వయంగా ప్రారంభించారు. అంచెలంచెలుగా ఈ పథకాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రతిపాదించారు. అయితే అదింత వరకు కార్యరూపం దాల్చలేదు.
దీంతో ఇప్పటికీ పేదలకందుతున్న బియ్యం నాణ్యతాలోపంతో ఉంటున్నాయి. జగన్ ఆకాంక్షలకనుగుణంగా అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తే ఎగుమతిదార్ల అక్రమ వ్యాపారానికి అడ్డుకట్టేసే అవకాశాలుంటాయి. ప్రభుత్వం ఒకసారి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తే రాష్ట్రంలోని జనాభాలో 90శాతానికి పైగా కలిగున్న తెల్లరేషన్ కార్డుల ద్వారా పొందుతున్న బియ్యం వారి వినియోగానికి అనుగుణంగా ఉంటుంది. వీరంతా ప్రభుత్వ బియ్యాన్నే ఇళ్ళల్లో వినియోగిస్తారు. ఈ బియ్యం అక్రమ మార్గాల్లో విదేశాలకెళ్ళే అవకాశాలుండవు. ప్రభుత్వం భరిస్తున్న వేల కోట్ల సబ్సిడీకి సార్ధకత కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital