Tuesday, November 26, 2024

AP | తిరుచానూరు సమీపంలో క్షుద్ర పూజల కలకలం..

తిరుపతి (ప్రభ న్యూస్ ప్రతినిధి) : తిరుపతి జిల్లా తిరుచానూరు ఆలయ సమీపంలోని ఓ గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కలకలం రేగింది. దీంతో స్పందించిన పోలీసులు అవి క్షుద్ర పూజలు కావని, ఇంటికి వాస్తు దోషానికి సంబంధించిన శాంతి పూజలుగా నిర్ధారించడంతో ఆ గ్రామస్థులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్నారని క‌చ్చితమైన సమాచారం లేకుండా ఎవరైనా సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి సర్కిల్ డిఎస్పి యశ్వంత్ హెచ్చరించారు.

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్ళపూడి గ్రామంలో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఒక వ్యక్తి తన ఇంటిలో పూజలు చేసుకుంటుండగా, ఆ పూజలను చూసిన గ్రామస్తులు సోషల్ మీడియాలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారు. ఈ ప్రచారంతో సదరు గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల్లోనే గ్రామాల ప్రజలు సైతం భయభ్రాంతులకు గురైయ్యారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన చంద్రగిరి డిఎస్పి తిరుచానూరు పోలీసులను అప్రమత్తం చేశారు.
వెంటనే తిరుచానూరు పోలీసులు ముండ్లపూడి గ్రామానికి వెళ్లి సదరు సోమశేఖర్ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ క్షుద్రపూజలకు సంబందించిన ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదన్నారు.

ఈ క్షుద్ర పూజల విషయమై సోమశేఖర్ ని విచారించగా అతను ముండ్లపూడి గ్రామంలో సొంతంగా ఒక ఇంటిని నిర్మించుకున్నాడని, ఆ ఇంటికి వాస్తు దోషాలు ఉన్నందున, అతనికి తెలిసిన గురువులను అడిగితే వారు అమావాస్య రోజున నవగ్రహ శాంతి పూజలు జరిపితే వాస్తూ దోషాలు ఉండవని చెప్పడం జరిగిందన్నారు. దీంతో అతను తన ఇంటిలో రాత్రి పూట శాంతి పూజలు చేస్తున్నట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలడంతో పోలీసులు ఎక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా సోమశేఖర్ ఇంటి నందు జరిగిన పూజలను గ్రామస్తులు తప్పుగా భావించి, సోషల్ మీడియాలో మరియు వివిధ ప్రచార మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేసినట్టుగా వివరించారు. క్షుద్ర పూజలనేటివి పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఎలాంటి భయాందోలనలకు గురి కావలసిన అవసరం లేదని డిఎస్పీ తెలిపారు.

- Advertisement -

ఒకవేళ ఎవరైనా క్షుద్ర పూజలు జరిపినా, క్షుద్రపూజలు చేస్తున్నట్టు తెలిసిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అలా కాకుండా వాస్తవాలను నిర్థారించుకోకుండానే ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినా, అలాంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు డిఎస్పి శ్రీ యశ్వంత్ విజ్ఞప్తి చేస్తునే, హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement