అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పంటల సాగులో అన్నదాతల ధోరణి మారుతుంది. సాంప్రదాయక పంటల పట్ల రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. గతంలో వరి పంట పట్ల రైతులు మొగ్గు చూపే వారు. దీంతో నీటి పారుదల సౌకర్యం అరకొరగా వున్నా వాటిని మాగాణిగా మార్చి వరి పండించే వారు. అయితే గత రెండేళ్లుగా వాణిజ్య పంటలు మిర్చి, పత్తి, అపరాలు, చిరు ధాన్యాల పంటల ఉత్పత్తులకు ధరలు ఆశాజనకంగా వుండడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు సాంప్రదాయక వరి నుంచి వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపారు. దీంతో ఈ సంవత్సరం మెట్ట, ఆరుతడి భూములకు గిరాకీ రాగా, మాగాణి భూములకు డిమాండ్ తగ్గింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో ఐదున్నర లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. సెప్టెంబర్ నెలాఖరుకు తొమ్మిది లక్షల ఎకరాల్లో సేద్యం జరగలేదని పేర్కొనగా, అక్టోబర్ నెలాఖరు కొచ్చేసరికి అదనంగా దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఇదిలావుండగా, ఈసారి ఖరీఫ్ పంటల సరళిలో రైతుల్లో కొత్త ధోరణి కనిపించింది. ఆహార పంటల సాగు తగ్గగా, వాణిజ్యపంటల సాగు పెరిగింది. అది కూడా ఎప్పటినుంచో వాణిజ్య పంటలు వేస్తున్న ప్రాంతాల్లో వాటి సేద్యం తగ్గగా, కొత్త ప్రాంతాల్లో పెరిగింది. నూనెగింజలలో వేరుశనగ సాగు బాగా తగ్గగా ఆముదాలు, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు పెరిగాయి. వర్షాలు, నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నప్పటికీ వేలాది ఎకరాలు సాగు లేక బీడు పడ్డాయి. ఈ సీజన్లో అన్ని పంటలూ కలుపుకొని 97.05 లక్షల ఎకరాల్లో సాగును ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. సాధారణ సాగు విస్తీర్ణం 92.05 లక్షల ఎకరాలు కాగా సుమారు 88 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. టార్గెట్‌లో దాదాపు నాలుగు లక్షల ఎకరాలు తగ్గాయి. గతేడాది కంటే రెండున్నర లక్షల ఎకరాల్లో, ముందటేడు కంటే ఐదు లక్షల ఎకరాల్లో సేద్యం తగ్గింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో మొత్తం పంటల సాగు 6 శాతం తగ్గగా ఆహార పంటల సేద్యం 8 శాతం తగ్గింది.
వరి సేద్యం 8 శాతం తగ్గింది. ఆహార పంటల్లో మొక్కజొన్న మాత్రమే నార్మల్ కంటే 14 శాతం పెరిగింది. ప్రస్తుతం మొక్కజొన్న వాణిజ్య అవసరాలకే అధికంగా సాగవుతోంది. ముతకధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు అన్నీ తగ్గాయి. ఆహార పంటలు అన్నమయ్య, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, కోనసీమలో తగ్గాయి. సంప్రదాయకంగా వరి పండించే జిల్లాల్లో ఈ ఏడాది ఆ పంట సాగు తగ్గింది. శ్రీకాకుళం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాలలో వరి సాగు తగ్గింది. ఉదాహరణకు నెల్లూరులో గతేడాది ఖరీఫ్‌లో 1.23 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడగా ఈసారి 52,500 ఎకరాల్లో నాట్లు వేశారు.
నూనెగింజల విషయాని కొస్తే వేరుశనగ సాగు బాగా పడిపోయింది. నార్మల్‌లో 25 శాతం తగ్గింది. చిత్తూరులో 61 శాతం, తిరుపతి 65, కడప 51, అన్నమయ్య 49, అనంతపురం 71, సత్యసాయి 98, కర్నూలు 60, నంద్యాల 54 శాతం మేరకు సాగైంది. వేరుశనగకు బదులు ఆముదాలు, పొద్దుతిరుగుడు, సోయాబిన్ సాగు చేశారు. వ్యాపార పంటలు పెరిగాయి. పత్తి సాగు నార్మల్ కంటే 9 శాతం పెరిగింది. ప్రకాశం, అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాలలో పెరగ్గా, ఎన్టిఆర్, గుంటూరు, పల్నాడు, విజయనగరం, మన్యం జిల్లాల్లో తగ్గింది. రాయలసీమలో వేరుశనగ స్థానంలో అక్కడక్కడ పత్తి సాగైంది. గతేడాది తామర, బొబ్బర తెగుళ్లతో మిర్చి రైతులు నష్టపోయిప్పటికీ ఈసారి ఏమాత్రం తగ్గలేదు. నార్మల్ కంటే 53 శాతం అధికంగా సాగైంది. ఉల్లి సైతం సాధారణం కంటే 63 శాతం సాగు పెరిగింది. పసుపు కూడా దాదాపు నార్మల్కు దగ్గరగా సాగైంది. చక్కెర ఫ్యాక్టరీల సంక్షోభంతో చెరకు సాగు 52 శాతం పడిపోయింది.