Tuesday, November 19, 2024

AP | వైసీపీ సమన్వయకర్తల్లో మార్పులు.. చెవిరెడ్డి, విజయసాయికి అదనపు బాధ్యతలు

తాడేపల్లి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో పలు కీలక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇన్ ఛార్జ్ ల మార్పు తర్వాత కనిపిస్తున్న అసంతృప్తిని చల్లార్చడంతో పాటు పలు చోట్ల పార్టీ పటిష్టంపై ఫోకస్ చేస్తున్న సీఎం జగన్ ఇవాళ పలు కీలక నియామకాలు చేశారు. వీటిలో ఇప్పటికే ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న వారితో పాటు పలువురు టికెట్ దక్కని సీనియర్లను ఇతర పదవుల్లో నియమించారు.

ఇవాళ సీఎం జగన్ ఆదేశాల మేరకు వివిధ రీజినల్ కో-ఆర్డినేటర్లకు పలు పార్లమెంటు నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఇందులో ముందుగా ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా ఎంపికైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంటు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. అలాగే సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డికి గుంటూరు పార్లమెంటు, నర్సారావుపేట పార్లమెంటు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు ఇచ్చారు..

మరోవైపు కడప నేత రామసుబ్బారెడ్డికి కర్నూలు పార్లమెంటు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్ గా నియమించారు. అలాగే కడప మాజీ మేయర్ కె.సురేష్ బాబును కడపపార్లమెంటు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల రీజినల్ కో-ఆర్డినేటర్ గా నియమించారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రిజనల్ కో-ఆర్డినేటర్ గా మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను నియమించారు. ఆయన ఇప్పటికే అక్కడ ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆధ్వరంయోల పనిచేస్తారని తెలిపారు. వీటితో పాటు విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement