అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు కోసం ఉపయోగిస్తున్న యాప్‌లో ఇంటి పేరు లేకుండా విద్యార్థుల పేర్లు మాత్రమే కనిపిస్తుండటం వల్ల తరగతి గదిలో అదే పేరుతో ఉన్న విద్యార్థుల హాజరు నమోదులో పొరపాట్లు జరుగుతున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష్యుడు మన్నం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు మంగళవారం రాసిన లేఖలో ఒకే పేరుతో ఉన్న విద్యార్థులను గుర్తించడంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల హాజరైన విద్యార్థికి ఆబ్సెంట్, ఆబ్సెంట్ అయిన విద్యార్థి అటెడన్స్ వేసే అవకాశం ఉందని వివరించారు. కనుక బాలబాలికల పేర్లు వేర్వేరు గ్రూపులుగా, ఇంటి పేర్లతో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించండి: ఆపస్ వినతి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాలు, అధికారుల ఒత్తిడి మధ్య పని చేస్తున్నారని, దానిని నివారించి ముఖ్యమంత్రి చెబుతున్నట్లు-గా ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా ఉండే విధంగా నిర్ణయాలు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ కుమార్, ఎస్ బాలాజీ అన్నారు. ఉపాధ్యాయుల మెడపై సస్పెన్షన్ కత్తి వేలాడదీయడం, చిన్న విషయాలకూ షోకాజ్ నోటీసు, సస్పెండ్ చేయడం తగదన్నారు. బోధన చేయాల్సిన ఉపాధ్యాయులను వారి పని వారిని చేయనీకుండా యాప్‌లు, మార్కుల అప్లోడు, గుమస్తా రాత పనులు, ఇతర పనులను అప్పజెప్పి, విద్యార్థులకు తగిన చదువు రావట్లేదని ఉపాధ్యాయులను శిక్షిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధనేతర పనులకు వేరే సిబ్బంది ఉంటారని, అందుకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అలాగే టీచర్ల మొబైల్స్‌లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే చాలా వ్యక్తిగత ఇబ్బందులు తలెత్తుతాయని, కనుక అవసరమైతే నాణ్యమైన బయోమెట్రిక్ యంత్రాలు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అందజేయాలని వారు డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.