ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే స్థలాన్ని మార్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. ఇంతకు ముందు గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి బుధవారం ఆయన సొంత గ్రామమైన బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, రేపు గౌతమ్‌రెడ్డి కుమారుడు ఇండియాకు రానున్నారు.
మంగళవారం ఉదయం నెల్లూరుకు ఎయిర్ అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తీసుకెళ్తారు. జిల్లా ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి గెస్ట్ హౌస్‌లో పార్థివ దేహాన్ని ఉంచుతారు. బుధవారం ఉదయం ఇక్కడి నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి తరలించి, అక్కడే ప్రభుత్వం లాంఛనాలతో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు హాజరుకానున్నారు.