కర్నూలు బ్యూరో : చంద్రబాబు అనుభవం వల్ల కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన అద్భుతంగా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు, బిజెపి రాష్ట్ర నాయకులు టీజీ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయన్నారు. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాటం మొదలు పెట్టింది తానేనని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ గుర్తు చేశారు.
రాయలసీమ ప్రాంతం వెనకబడిందని ఆధారాలతో సహా పొలిటికల్ పార్టీలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయంలో దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ మాకు పూర్తి మద్దతు తెలిపిన విషయాని గుర్తు చేశారు. తెలంగాణ విభజనకు అప్పటి సిఎం రోశయ్య మద్దతు తెలపలేదని చెప్పారు. విభజన నేపథ్యంలో ట్యాంకు బండ్ పై విగ్రహాలు పగలకొడుతున్నప్పుడు శ్రీ కృష్ణ దేవరాయ విగ్రహం పగలగొట్టే ముందు మాపై దాడి చేయండని కోరాను. వెంటనే ఆందోళన కారులు మమ్మల్ని గౌరవించి వెనక్కి వెళ్ళారన్నారు. రాష్ట్ర విభజన హామీల అమలు చేసే దిశగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టాలన్నారు. విభజన హామీల అమలుకు తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలన్నారు. తద్వారా వెనుకబడిన ఏపీ అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. వీటివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలు లాభపడతాయన్నారు. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీ పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో ట్యాక్స్ లు కడుతున్నారు. అందులో మనకు రావాల్సిన షేర్లు, జీఎస్టీ రావడం లేదన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై చొరవ తీసుకోవాలని కోరారు. సిద్దేశ్వరం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జితో ప్రాజెక్టు చేపట్టాలని కేంద్ర మంత్రి గడ్కారిని కోరాను. అందుకు గడ్కారి ఓకే అన్నారని తెలిపారు. కానీ గత ప్రభుత్వం అందుకు ప్రతిపాదనలు పంపకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు వెనక్కి వెళ్లిందన్నారు. రాయలసీమ డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామన్నారు. గత ప్రభుత్వం అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిందని, దీంతో ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిందన్నారు. భారీగా ప్రజాధనం వృథా అయిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాయలసీమలో పారిశ్రామిక విప్లవం వస్తోందన్నారు. నా కుమారుడు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సీమలో ప్రాజెక్టుల స్ధాపనకు నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఆయకట్టు మొత్తానికి నీరందించేలా కాలువల పనులు చేపట్టాలని టీజీ వెంకటేష్ కోరారు.
వైసీపీ, వామపక్ష పార్టీలు ఇంకా నిషాలో ఉన్నారు. కేంద్ర పెద్దల నిర్ణయం మేరకే రాష్ట్ర నాయకత్వ మార్పు ఉంటుందన్నారు. బీజేపీ పెద్దలు.. మెగాస్టార్ చిరంజీవి స్నేహ పూర్వకంగా ముందుకు వెళ్తున్నారు. తదుపరి విషయాలు తనకు తెలియవన్నారు. ఆర్యవైశ్యులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. డోన్ టీడీపీ నాయకుడిపై దాడిచేసిన వారిని రెండు రోజుల్లో అరెస్టు చేయాలి.. లేకుంటే ఆందోళనలు మొదలు పెడతామన్నారు. గత ప్రభుత్వంలో ఆలయాలపై ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కర్నూల్ కు హైకోర్టు బెంచ్ గతంలోనే వచ్చేది. కానీ కొంతమంది న్యాయవాదులు ఆందోళనలు చేయడం వల్ల ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుందన్నారు. చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని, సీమ ప్రజల కళ నెరవేర్చాలని టీజీవి సూచించారు.