అమరావతి, ఆంధ్రప్రభ : తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికలలో అక్రమాలు చోటుచేసుకున్నాయని పోలీసుల సాయంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మేరకు బుధవారం తిరుపతి కలెక్టర్‌కు లేఖ రాసి, ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12 డైరెక్టర్ పోస్టులకు బుధవారం జరిగిన ఎన్నికలలో దొంగ ఓట్లు వేశారని, ఇదంతా అధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని ఆరోపించారు. మిగిలిన పార్టీల అభ్యర్దులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోటీలో ఉన్న మురళీకృష్ణారెడ్డి, బుల్లెట్ రమణ, జె.వి. శ్రీనివాసులపై కేసులు పెట్టారని తెలిపారు. అధికార పార్టీ మద్దతుగా ఉన్న అభ్యర్దులకు నకిలీ ఐడీ కార్డులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు.ఎన్నికలలో పోటీ చేస్తున్న దళిత వర్గానికి చెందిన వలమునిని పోలీసులు అదుపులోకి తీసుకోవటం విస్మయానికి గురిచేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ రూ. 350 కోట్ల వార్షిక టర్నోవర్ తో పాటు రూ. 290 కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు కలిగిఉందని ఈ బ్యాంక్ పై వైకాపా నేతల కన్ను పడిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సభ్యుల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకుని ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.