Friday, November 22, 2024

ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కు చంద్ర‌బాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం, తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి మరియ దాస్‌ అలియాస్ చిన్నాను అధికార వైసీపీకి చెందినవారి నుంచి, గూండాల నుంచి తీవ్ర ప్రాణహాని ఉందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

మరియ దాస్‌కు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం, ఎంపీ నందిగాం సురేష్ బాధ్యత వహించాలని.. మరియ దాస్‌పై జరిగిన వేధింపులు, దాడులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, దాస్‌కు ఎలాంటి హాని జరగకుండా చూసేందుకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని.. ఈ విషయంలో పోలీసుల సత్వర చర్యలు మాత్రమే దాస్ ప్రాణాలను రక్షిస్తాయని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

పులి మరియ దాస్ టీడీపీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. దీంతో, వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ ఆయనపై పగ పెంచుకున్నారని.. తన రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో మరియ దాస్‌ను నందిగాం సురేష్ టార్గెట్ చేశారని పేర్కొన్నారు. ఎంపీ నందిగాం సురేష్‌ ఆదేశాలతో మరియ దాస్‌ పై దాదాపు 30 కేసులు పెట్టారు.. ఈ వేధింపులకు పరాకాష్టగా, 18 సెప్టెంబర్ 2021న, ఉద్దండరాయునిపాలెం గ్రామం మధ్యలో మరియ దాస్‌పై సురేష్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నందిగాం సురేష్ అనుచరులు మరియ దాస్‌ను చంపాలనే ఉద్దేశ్యంతో ప్రతిరోజూ అతని కదలికలను అనుసరిస్తూ ఆయన ఇంటిపై రాత్రి సమయంలో నిఘా ఉంచారని చంద్ర‌బాబు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు మరియ దాస్ కుటుంబ సభ్యులను, బంధువులను చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement