Friday, December 20, 2024

Kuppam | పేదరికం లేని సమాజమే చంద్రబాబు లక్ష్యం.. భువనేశ్వరి

కుప్పం, డిసెంబర్ 20 (ఆంధ్రప్రభ ): గత ప్రభుత్వం వారి జేబులు నింపుకోవడానికి ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని, అభివృద్ధి అన్నమాట వినపడకుండా అరాచకం సృష్టించారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పేదరికం లేని సమాజం చంద్రబాబు కల అని ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే ఆయన కోరిక అని అన్నారు. 2వ రోజు కుప్పం పర్యటనలో భాగంగా కుప్పం మండలం వాన గుట్టపల్లి గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. డ్వాక్రా ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తూ మహిళలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను చంద్రబాబు ప్రత్యక్షంగా చూశారని, డబ్బు కోసం ఆడబిడ్డలు కష్టపడకూడదు, ఎవరిపైనా ఆధారపడకూడదనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు. ఒకప్పుడు వందా, రెండు వందల కోసం తండ్రిపైనో, భర్తపైనో ఆధారపడిన మహిళలు నేడు నేరుగా బ్యాంకుకు వెళ్లి లక్షల రూపాయల లావాదేవీలు నడుపుతున్నారంటే అందుకు చంద్రబాబు తెచ్చిన డ్వాక్రా సంఘాలే కారణమని ఆమె అన్నారు. నేను కోరుకునేది ఒక్కటే మహిళలు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి, తాము సంపాదించిన డబ్బును ఖర్చు చేసుకునే హక్కు వారికే ఉంటుందన్నారు. మహిళలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉన్నట్టేనని ఆమె అన్నారు.

కుప్పం అభివృద్ధి మా ధ్యేయం:నారా భువనేశ్వరి…
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కుప్పం గురించే మాట్లాడుతూ ఉంటారని, నన్ను గెలిపించి ఇంతవాణ్ణి చేసిన కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేను అంటుంటారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. దురదృష్టవశాత్తు గత ఐదేళ్లూ కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి దూరమైందని, రాబోయే ఐదేళ్లలో కుప్పం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని తెలిపారు.

- Advertisement -

మోడల్ మున్సిపాలిటీగా కుప్పం:
కుప్పం ను మోడల్ మునిసిపాలిటీగా తీర్చిదిద్దాలనే చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ‘కడా’ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని నారా భువనేశ్వరి తెలిపారు. ఇందులో భాగంగా అభివృద్ధి పనులకు మొదటి విడతగా రూ.45కోట్ల రూపాయలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుందని ఆమె అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో డ్రైనేజ్ నిర్మాణం కోసం రూ.110 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం, గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా ఏరియా ఆస్పత్రుల మరమ్మతుల కోసం రూ.1కోటి 40 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

కుప్పం మున్సిపాలిటీలో సుమారు వెయ్యి లైట్లు కొనుగోలు చేసి వీధి దీపాలను అమర్చారని, పేదల ఆకలి తీర్చేందుకు కుప్పంలో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు జరిగిందన్నారు. వచ్చే ఏడాది జూలై నాటికి హంద్రినీవా పూర్తయితే అందరికీ నీటి కష్టాలు తీరుతాయన్నారు. అలాగే కుప్పంలో ఎలీవ్ ఏర్పాటు కాబోతోంది. దీని వల్ల మహిళలకు ఉపాధి లభిచడంతో పాటు వారే నలుగురికి ఉపాధి కల్పించే పరిస్థితులు వస్తాయన్నారు.

వానగుట్టపల్లి నుంచి ఇక వలసలు ఉండవని, ఈ గ్రామంలో 45 పొదుపు సంఘాలు ఉన్నాయని చెప్పగానే నాకు సంతోషం అనిపించిందని ఆమె పేర్కొన్నారు. మీరు ఆర్థికంగా బలోపేతం కావడానికి, స్వయం ఉపాధి పొందేందుకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు. వానగుట్టపల్లి గ్రామాస్థులు నారా భువనేశ్వరికి ఘనస్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మన కుప్పం-మన చంద్రన్న బల్లపై కూర్చోబెట్టారు. గత ఐదేళ్లుగా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను, ప్రస్తుతం గ్రామంలో కావాల్సిన అభివృద్ధి పనుల గురించి భువనేశ్వరికి వివరించారు. సమస్యలన్నింటినీ ముఖ్యమంత్ర చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement