Friday, November 22, 2024

AP: చంద్ర‌బాబు బెయిల్ ర‌ద్దు విచార‌ణ మూడు వారాలు వాయిదా..

ఢిల్లీ: స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు రెండు వారాలు సమయం ఇచ్చింది. కాగా, స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వ పిటిషన్‌పై నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. చంద్రబాబు బెయిల్‌ రద్దుపై జవాబు చెప్పాలని ధర్మాసనం పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. స్కిల్‌ డివలప్‌మెంట్‌ కుంభకోణంలో దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అధికారుల పనిపడతామని హెచ్చరిస్తున్నారు. ఇలా మాట్లాడుతూ బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారు. కనుక, వెంటనే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. దీంతో, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు చంద్రబాబు తరఫు లాయర్లను ఆదేశించింది. ఈ సందర్భంగా తమకు కొంత సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా కోరారు. దీంతో, కౌంటర్ దాఖలు చేసేందుకు ధర్మాసనం రెండు వారాలు సమయం ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement