మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన విషయమై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాధాను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూడటం అత్యవసరమన్నారు
ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అటవిక, గుండా రాజ్యం నడుస్తోందన్నారు. రాధాపై రెక్కి నిర్వహించేంత వరకు పరిస్థితి వెళ్లిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితేంటో అర్థం అవుతోందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. గతంలో జరిగిన చట్టవిరుద్ధమైన, హింసాత్మక సంఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకోనందుకే ఇటువంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయన్నారు. వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంపై ఒత్తిడులకు తలొగ్గకుండా త్వరితగతిన, పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు శిక్ష పడేలా చూడాలని చంద్రబాబు కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital