Friday, November 22, 2024

రైతుల‌ను దగా చేసిన చంద్రబాబు, కడుపుమంటతోనే కోనసీమ అల్లర్లు.. ధ్వజమెత్తిన సీఎం జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ ; రైతుల సంక్షేమం, అభివృద్ధి విషయంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో మంగళవారం ఆయన వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద 2021 ఖరీఫ్‌ సీజన్‌ కు గాను 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్ల పరిహారాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఏరువాకను రైతులు ప్రారంభించిన సందర్భంగా ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రాయలసీమ అంటే కరువు ప్రాంతమనే నానుడి అంతరించి సాగునీటితో, వ్యవసాయపనులతో పల్లెలన్నీ కళకళలాడటం తనకంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ప్రాజెక్టుల నుంచి సాగునీటితో పాటు భూ గర్భ జలాలు కూడా సమృద్ధిగా అందుబాటు-లోకి వచ్చాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల వల్ల ఒక సీజన్‌ లో వచ్చిన నష్టాన్ని మళ్లీ ఆ సీజన్‌ ప్రారంభమయ్యే లోపే బీమా పరిహారాన్ని అందించే మంచి సంప్రదాయానికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శ్రీకారం చుట్టామన్నారు. వేల కోట్ల నష్టపరిహారాన్ని అందించటం రాష్ట్రంలో ఇదే ప్రథమం.. పంటల బీమా చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అవినీతికీ, వివక్షకు తావు లేకుండా పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఉచిత పంటల బీమాను వర్తింప చేస్తున్నట్టు వెల్లడించారు.

రైతులను దగా చేసిన టీడీపీ

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రైతులను నిలువునా దగా చేసిందని జగన్‌ ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 దాకా అయిదేళ్లలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 35.80 లక్షల మంది రైతులకు రూ.3411 కోట్ల నష్టపరిహారం అందిస్తే..తాము గడిచిన మూడేళ్లలోనే 44.28 లక్షల మంది రైతులకు రూ.6685 కోట్ల నష్టపరిహారం అందించామన్నారు. చంద్రబాబు పాలనలో బకాయిలుగా ఉణ్న రూ.717 కోట్ల ఇన్సూరెన్స్‌ ను కూడా తామే చెల్లించి రైతులకు న్యాయం చేశామన్నారు. వైయస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద 53 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ.23,875 కోట్ల ఆర్ధికసాయం అందించాం. రైతు భరోసా కింద వరుసగా నాలుగో ఏడాది కూడా తొలి విడతగా రూ.7500 లను రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం గుర్తు చేశారు. గడిచిన మూడేళ్లలో పంటలబీమా కింద ఇచ్చిన సొమ్ము రూ.6685 కోట్లు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింది రైతులకు రూ 1613 కోట్లు చెల్లించాం..సున్నావడ్డీ కింద రూ.1283 కోట్లు చెల్లించాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలకు ఈ-క్రాప్‌ చేయిస్తూ రైతులందరికీ ప్రభుత్వ పథకాలను వర్తింపచేస్తున్నామని జగన్‌ తెలిపారు. ఈ దశలో టీడీపీ పాలనకూ, వైసీపీ పాలనకు ఉన్న తేడాను రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం అర్ధం చేసుకోవాలని సీఎం కోరారు.

పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌…

వ్యవసాయ అవసరాల కోసం పగటిపూటే 9 గంటల పాటు నిరంతరాయ ఉచిత విద్యుత్‌ సరఫరాకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. ఉచిత విద్యుత్‌ కోసమే గడిచిన మూడేళ్లలో మూడేళ్లలో రూ.25,800 కోట్లు ఖర్చు పెట్టాం. పగటిపూటే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే ఫీడర్ల సామర్ధం సరిపోదు..దాని కోసం ప్రత్యేకంగా మరో రూ.1700 కోట్లు- వ్యయం చేసినట్టు సీఎం గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.8,750 కోట్ల ఉచిత విద్యుత్‌ బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ధాన్యం చెల్లింపులు కోసం రూ.960 కోట్లు, విత్తనాల కొనుగోలు కోసం బకాయిలు పెట్టిన రూ.430 కోట్లను కూడా చెల్లించామన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, మరో రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాలనిధిని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు.

- Advertisement -

పవన్‌ కు సీఎం సవాల్‌..

రైతుల ఆత్మహత్యలపై అనంతపురం, గోదావరి జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబునాయుడు దత్తపుత్రుడు నష్టపరిహారం అందని ఒక్క రైతునయినా చూపించగలడా అంటూ పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌ పై సీఎం జగన్‌ విమర్శలు సంధించారు. దురదృష్టవశాత్తు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టాదారు పాసు పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరికీ రూ 7 లక్షల పరిహారం అందించాం..సీసీఆర్సీ కార్డులున్న కౌలు రైతులకు కూడా పరిహారం అందించాం..ఒక్కరి-కై-నా పరిహారం రాలేదని నిరూపించగలరా అని సీఎం ప్రశ్నించారు. 2014 నుంచి 2109 మధ్య ఆత్మహత్య చేసుకున్న 458 రైతు కుటుంబాలకు సైతం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆదుకున్నామన్నారు. మేనిఫెస్టోలో రైతులకిచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు మంచోడెలా అయ్యారో, మాట తప్పకుండా అన్నిహామీలను అమలు చేస్తున్న తానెట్టా చెడ్డోడినయ్యానో దత్తపుత్రుడు చెప్పాలన్నారు.క్రాప్‌ హాలిడే పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారు..ధాన్యం సేకరించిన 21 రోజుల్లోనే డబ్బులు ఇస్తున్నందుకా క్రాప్‌ హాలిడే అని ప్రశ్నించారు.

పదోతరగతి పరీక్షల్లోనూ రాజకీయం..

పదో తరగతి పరీక్షా ఫలితాలను కూడా రాజకీయాలకు వాడుకుంటు-న్న దౌర్భగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని జగన్‌ అన్నారు. కోవిడ్‌ వచ్చిన తర్వాత రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మస్యర్యం కలిగించాలి..దానికోసం సప్లిమెంటరీ తీసేసి నెలలోపే మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తున్నాం..రెగ్యులర్‌ కోర్సులోనే పాసయినట్టుగా సర్టిఫికేట్లు అందిస్తున్నాం.. రాష్ట్రంలో విద్యా రంగం రూపురేఖలు మారుతుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకోతున్నాడని జగన్‌ అన్నారు.

కడుపుమంటతోనే కోనసీమ అల్లర్లు..

కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెడితే కులాలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని సీఎం అన్నారు. ఒక దళిత మంత్రి, ఒక బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టారు. రాష్ట్రంలో దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. సామాజికన్యాయం అనే మాట ఉచ్ఛరించేందుకు టీడీపీకి అర్హత లేదన్నారు. తమ ప్రభుత్వం మాత్రమే ఎస్‌.సీ, ఎస్‌.టీ-, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచితమైన స్థానమిచ్చి గౌరవిస్తోందని సీఎం తెలిపారు. ఈ సభలో మంత్రులు కాకాని గోవర్దన్‌ రెడ్డి, గుమ్మనూరు జయరాం, కె.వి ఉషశ్రీ చరణ్‌ తోపాటు వెన్నపూస గోపాల్‌ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌, వ్యవసాయ శాఖ స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పూనం మాలకొండయ్య, జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌, ఎంపీలు గోరంట్ల మాధవ్‌, తలారి రంగయ్య, జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాలగుండ్ల శంకర నారాయణ, శ్రీధర్‌ రెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పాఠశాలల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్‌, ఏడిసిసి బ్యాంక్‌ ఛైర్మన్‌ లిఖిత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, ఇంచార్జి జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement