అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఆయన తిరుమల చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి డిసెంబర్ 1వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా అమరావతికి చేరుకుంటారు. కొద్ది రోజుల అనంతరం సమయానుకూలంగా బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్నారు.
అనారోగ్య సమస్యలు, కంటి ఆపరేషన్ అనంతరం కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వాస్తవానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తరువాత వెంటనే శ్రీవారి దర్శనం చేసుకోవాలని చంద్రబాబు భావించారు. అయితే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటు-న్న నేపథ్యంలో తక్షణమే హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
దీంతో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకుని హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో మొక్కులు తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ దేవాలయాల్లో దర్శనాలు, మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం డిసెంబర్ మొదటి వారం నుంచి చంద్రబాబు మళ్లీ పూర్తిస్థాయి పార్టీ, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.