వైసీపీ పాలనలో నేతన్నల నేటి దుస్థితిని తలచుకుంటే మనసు కలచివేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ లో గత తెలుగుదేశం పాలనలో నేతన్నలకిచ్చే త్రిఫ్టును 8 నుండి 16 శాతానికి పెంచాం. నూలుపై సబ్సిడీని 10 నుండి 40శాతానికి పెంచాం. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాల రాయితీ అమలు చేశాం. పనులు లేని వర్షాకాలానికి భృతి అందించాం. 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చాం. ఆదరణతో పనిముట్లు అందజేసి అండగా నిలిచాం. తెలుగుదేశం హయాంలో నాటి పరిస్థితుల్ని, వైసీపీ ప్రభుత్వంలో నేతన్నల నేటి దుస్థితిని తలచుకుంటే మనసు కలచివేస్తోంది’ అని చంద్రబాబు అన్నారు.
‘ఏపీలో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.50వేలకు పైగా వచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసి రూ.24 వేలతో సర్దుకోమంటూ తీరని ద్రోహం చేస్తోంది. నేతన్నల అభివృద్ధిని, అభ్యున్నతిని ఈ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. నాడు చేనేతలకు స్వర్ణయుగంగా ఉన్న పథకాలను రద్దుచేసి చీకట్లలోకి నెట్టేశారు. తెలుగుదేశం హయాంలో అందించిన ప్రోత్సాహకాలు, రాయితీలు నేతన్నలకు ఇవ్వాలి. అలాగే కరోనాతో నష్టపోయిన కార్మికులకు పరిహారం కూడా అందజేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
నేతన్నలకు వైసీసీ ప్రభుత్వం ద్రోహం చేసిందిః చంద్రబాబు
Advertisement
తాజా వార్తలు
Advertisement