ఏపీలో అరాచక పాలన చేస్తున్న సీఎం జగన్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంక్షోభం, విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, కోతలపై జనం ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలతో కార్మికుల ఉపాధికి గండి పడుతుందని, పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలపై పన్నులు విధింపుపై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం తీరుపై ఆన్లైన్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కొవ్వొత్తుల రగడ, అగ్గిపెట్టే, బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేయాలని, ఈ కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలో నిర్వహించే ఆందోళనలో తాను పాల్గొంటానని, లోకేశ్, అచ్చెన్నాయుడు కూడా ఆయా జిల్లాలో పాల్గొంటారని వివరించారు. క్షేత్రస్థాయికి వెళ్లని నేతలను మార్చేందుకూ వెనుకాడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.