Saturday, November 23, 2024

చంద్రబాబును అరెస్ట్ చేయాలి, పెగాసస్‌తో దేశద్రోహానికి పాల్పడ్డారు.. ఢిల్లీలో వైసీపీ ఎంపీల డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించుకుని దేశద్రోహానికి పాల్పడ్డ చంద్రబాబు నాయుణ్నిఅరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. ఆపార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, తలారి రంగయ్య, రెడ్డప్ప న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ద్వారా దీన్ని ఉపయోగించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కేంద్రం దీన్ని అషామాషిగా తీసుకోవద్దని, ఇది దేశ భద్రతకు భంగం కలిగిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నేరాన్ని చూస్తూ కూర్చుంటే అది నేరం చేసినట్టే అవుతుందని, తక్షణమే విచారణ జరపాలని కోరారు.

ఈ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మద్యాన్ని ప్రవేశపెట్టింది, వింత వింత లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనని సుభాష్ చంద్రబోస్ గుర్తు చేశారు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్ పేరుతో బ్రాండ్లు అమ్మింది వారేనని అన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ పేర్లను అవమానించేలా వారి పేర్లు లిక్కర్ బ్రాండ్లకు పెట్టారని, డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల వియ్యంకుడివేనని ఆరోపించారు. ఇన్ని చేసి టీడీపీ నేతలు సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్‌ను వినియోగించిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టు కమిటీ దర్యాప్తు చేయాలని ఎంపీ తలారి రంగయ్య విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభుత్వం పెగాసెస్ ఉపయోగించారనే అంశాన్ని మరుగుపరచడం దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. పెగాసెస్ ఆఫర్ వచ్చిందని లోకేష్ ఇప్పటికే అంగీకరించినందున లోతుగా విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement