Wednesday, October 16, 2024

White Paper జగన్ ఎవరి సొమ్మును వదల్లేదు… ఏ శాఖ నిధులను మిగల్చలేదు.. చంద్రబాబు

ఆర్థిక వ్యవస్థ విధ్వంసం.
అందుకే ఆదాయం కోల్పోయాం ఏపీలో పట్టణాలు తక్కువ
సేవారంగం తరలిపోయింది
అప్పుల కుప్పలు పెరిగాయి
అన్నిటికీ పోలవరమే దిక్కు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​గా అమరావతిని అభివృద్ధి చేస్తాం
అసెంబ్లీలో ఆర్థిక శ్వేతపత్రం విడుదల చేసిన చంద్ర‌బాబు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: అయిదేళ్ల వైసీపీ పాలన ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని, ఆర్థిక అవకతకలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు వచ్చామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై, వైసీపీ హయాంలో ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సరైన విధానం లేకుండా రాష్ట్ర విభజన జరగడంతో.. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. రాజధానిగా హైదరాబాద్ ను కోల్పోవడంతో.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఏపీలో పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండటంతో ఆదాయం చాలా తక్కువగా ఉంటుందని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రానికి 46 శాతం ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వస్తే..42 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 54 శాతం ఆదాయం వస్తోందన్నారు. కృష్ణపట్నం పోర్టు ఏపీలో ఉంటే.. దాని రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉందన్నారు.

ఎపికి అప్పులే మిగిలాయి …


కంపెనీలు, ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉంటే.. అప్పులు ఏపీకి మిగిలాయని, పునర్విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9,10 సమస్యలు పరిష్కారం కాలేదని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. విభజనలో సేవా రంగం తెలంగాణకు వెళ్తే.. ఏపీకి వ్యవసాయం వచ్చిందని, రాష్ట్రంలో సేవల రంగం అభివృద్ధి చెందితే.. అంతా అభివృద్ధి జరుగుతుందన్నారు. వ్యవసాయం ఎక్కువగా ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఆదాయం తక్కువగానే ఉంటుందని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులను వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.

ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
2019… -24 మధ్య రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, పన్నులను విపరీతంగా పెంచేశారని, చివరికి చెత్తపై కూడా పన్ను వేశారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో జీఎస్ డీపీ రూ.6.94 లక్షల కోట్లు తగ్గిందన్నారు. తమది ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వమని, ఇస్తామని చెప్పిన పెన్షన్ ను సకాలంలో అందజేశామని తెలిపారు. 2014..-19 లో రాష్ట్రం అభివృద్ధి దిశగా పనిచేస్తే.. 2019..-24 మధ్య రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు.

- Advertisement -

పోలవరమే దిక్కు

పోలవరం పూర్తయితే సాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయని చంద్రబాబు అన్నారు. ఇక ప్రజా అవసరాలకు పట్టిసీమను తెచ్చామని తెలిపారు. రూ.1667 కోట్లు ఖర్చు చేశాం. పట్టిసీమతో రూ.44వేల కోట్ల ఆదాయం సమకూరిందని సీఎం చంద్రబాబు వివరించారు. కానీ అప్పటి ప్రభుత్వం అయిదేళ్లపాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని తెలిపారు.‘‘ గోదావరి ఉన్నంత వరకూ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు. కానీ ఆ పరిస్ధితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు. పోలవరానికి 15,364 కోట్లు ఖర్చు చేశాం. అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈపాటికే ప్రాజెక్టు ప్రారంభమయ్యేది. కేంద్రం వేసిన ఎక్సఫర్ట్ కమీటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సమాంతరంగా కొత్త డయాఫ్రాం వాల్ నిర్మించాలని అత్యవసర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నాం. దీంతో రూ.990 కోట్లు దీనికోసం ఖర్చే చేయాల్సి వస్తోంది’’ అని చంద్రబాబు అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా మారుస్తాం

అమరావతిలో ఉండే మొదటి అక్షరం ఏ..చివరి అక్షరం ఐ అని.. అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్ది పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని తెలిపారు. యావత్ ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించే రోజు వస్తుందని పేర్కొన్నారు.2014..-18 మధ్యకాలంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తెచ్చామని వివించారు. 16 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలను కుదుర్చుకున్నామని, రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమలు పనులు కూడా ప్రారంభించాయని తెలిపారు.

గత 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా, జగన్ రెడ్డి పాలన ఎలా సాగిందో సాక్ష్యాధారాలు, గణాంకాలు వివరించిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు : రూ.9,74,556 కోట్లు (పది లక్షల కోట్లు) ..వీటిలో ఇంకా కార్పోరేషన్ రుణాలు, ఇతర శాఖల నుంచి రావలిసిన సమాచారం ఇంకా ఉంది.

ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్ధిక విధ్వంసానికి ఒక ఉదాహరణ – 33 సంస్థల నుంచి, వాళ్ళు దాచుకున్న డబ్బులు, రూపాయి లేకుండా మొత్తం లాగేసారు.

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న పెండింగ్ బిల్స్ : రూ.1.35 లక్షల కోట్లు – మొత్తం బాకీలు పెట్టి, దోచుకుని, జగన్ రెడ్డి వెళ్ళిపోయారు. ఈ భారం మొత్తం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై పడింది.

జగన్ రెడ్డి ఎలాంటి వాడంటే, చివరకు డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులు కూడా లాగేసారు.

విశాఖలో ఒక్క ఆస్తి కూడా వదిలి పెట్టలేదు. కాలేజీలు, రైతు బజార్లు, పోలీస్ క్వార్టర్స్, ప్రభుత్వ ఆఫీసులు, ఇలా ప్రతి ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టాడు. రూ.2 వేల కోట్ల అప్పు కోసం, విశాఖలో మొత్తం ఆస్తులు తాకట్టు పెట్టాడు. అందుకే విశాఖ వాసులు వాత పెట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement