అమరావతి, ఆంధ్రప్రభ : టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన యధాతథంగా సాగించాలని నిర్ణయానికి వచ్చారు. బుధవారం మినీ మహానాడు నిర్వాహణపై కృష్ణా, మదనపల్లి జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలతో తన పర్యటన అంశాలపై ఆయన చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గుడివాడ మినీ మహానాడును వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మదనపల్లిలో నిర్వహించనున్న కార్యక్రమంపై కొంత సందిగ్ధత నెలకొంది. అయితే మదనపల్లి నేతలు యధావిధిగా పర్యటన కొనసాగించాలని చంద్రబాబుకు సూచించారు.
దీంతో ఆయన జూలై 6 నుంచి 8వ తేదీ వరకు పర్యటించాలని తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. జూలై 6వ తేదీన మదనపల్లిలో మినీ మహానాడులో చంద్రబాబు పాల్గొంటారు. 7వ తేదీన పీలేరులో అన్నమయ్య జిల్లా నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తారు. 8న నగరి, జీడీ నెల్లూరులో చంద్రబాబు రోడ్‌షో చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గుడివాడ మహానాడుపై కూడా కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు మాట్లాడారు. రాయలసీమ పర్యటన అనంతరం గుడివాడ మహానాడును నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.