(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : నాడు నష్టాల్లో ఉన్నప్పుడు గానీ… నేడు సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని గట్టెక్కించింది మాత్రం చంద్రబాబు ఒక్కరేనని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ పేర్కొన్నారు. తన కేసుల కోసం రాష్ట్రం మొత్తాన్ని జగన్ తాకట్టు పెడితే, ఉత్తరాంధ్ర, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పెద్దలను ఒప్పిస్తున్నారని గుర్తు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో త్వరలోనే ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుందన్న ఆయన, మండలానికి ఒక క్లస్టర్ను ఏర్పాటు చేస్తే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తిరువూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు కృషితోనే ఉక్కు ఆర్థిక భరోసా లభించిందన్నారు. ఉత్తరాంధ్ర కే కాకుండా మొత్తం ఏపీకే మణిహారంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఉందని, నాడు ఎంతో మంది విరోచిత పోరాటాలు త్యాగాలతో సాధించుకున్న సంస్థను పునరుజ్జీవించడానికి ఎన్డీఏ ప్రయత్నిస్తుందని, దానికి అనుకూలంగా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం శుభ పరిణామమన్నారు. కేసుల నుండి విముక్తి కల్పించండి, కావాలంటే ఏపీ రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లే వారిని, దానికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నేడు చంద్రబాబు వెళ్లి వస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్తను చెబుతూనే ఉందని, తాజాగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కు భారీ ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు.
తిరువూరులో ఇండస్ట్రియల్ పార్క్…
తిరువూరు నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ప్రస్తుతం ప్రభుత్వ భూముల ఎక్కడ ఉన్నాయనే దానిపై సర్వే జరుగుతుందని తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు. దీనిపై ఎంపీ కేసీనేని శివనాద్ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రభుత్వ భూములు వివరాలు సేకరించి అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో తిరువూరులో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒక లెదర్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఎంపీ తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో తిరువూరు ప్రాంతంలో కూడా చిన్న పరిశ్రమలు కూడా ఎంతోమంది చేత ఏర్పాటు చేయించి వ్యాపారం పంచే దిశగా కార్యాచరణ రూపొందించినట్లు కొలికిపూడి శ్రీనివాస్ వివరించారు.