అమరావతి, ఆంధ్రప్రభ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ టూర్‌లో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. జనసైనికుల అరెస్ట్, పోలీసుల ఆంక్షలపై ఆదివారం ఆయన పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వం చర్యలపై ఇరువురు చర్చించారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఆంక్షలు విధించడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. పోలీసులు తన పర్యటనకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జనసైనికులను, అరెస్ట్ చేసిన అంశాలను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలో అధికార పార్టీ పోలీసులతో రాజ్యం చేయాలని చూస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేతల కార్యక్రమాలను అడ్డుకోవడం, ఆటంకాలు సృష్టించడం, వ్యక్తిగత దూషణల వంటి అప్రజాస్వామిక విధానాలతో వైకాపా పనిచేస్తుందని విమర్శించారు. జనసైనికులను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్యని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కుందని దానిని పాలకులు ఎలా హరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై ఆది నుంచి వైకాపా ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తుందని జనసేనానితో చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనసేనాని పవన్‌కు పోలీసులు నోటీసులు ఇవ్వడం సరికాదన్న చంద్రబాబు తక్షణమే ఆయన పర్యటనపై ఆంక్షలను ఎత్తివేసి జనసైనికులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.