Friday, November 22, 2024

కేబినేట్ తీసుకున్న నిర్ణ‌యాలపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోనే హ‌క్కు లేదు …..చంద్ర‌బాబు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని ) అరెస్ట్ చేసి ఇవాళ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్బంగా చంద్రబాబు వాంగ్మూలాన్ని మొదట కోర్టు తీసుకుంది. అనంతరం చంద్రబాబు తరఫున సీఐడీ తరఫున వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే న్యాయమూర్తి ముందు స్వయంగా చంద్రబాబు తన వాదనలు వినిపించారు..
నేను ఏ తప్పూ చేయలేదు. రాజకీయ కక్షతోనే నాపై కేసు పెట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా అరెస్టు అక్రమం. శనివారం ఉదయం 5.40 గంటలకు నాకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం 5.40 గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. మళ్లీ చెబుతున్నాను.. నేను ఎలాంటి తప్పు చేయనేలేదు’ అని న్యాయమూర్తికి స్వయంగా చంద్రబాబు వాదనలు వినిపించారు. బాబు వాదనలను న్యాయమూర్తి రికార్డ్ చేశారు. ఏసీబీ కోర్టులో తన వాదనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోర్టును కోరగా.. న్యాయమూర్తి అనుమతించారు. దీంతో చంద్రబాబు తన వాదనలు స్వయంగా వినిపించుకున్నారు.
‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు 2015-16 బడ్జెట్‌లో పొందుపర్చాం. దీనికి రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరు. 2021 డిసెంబర్‌ 9న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కానీ.. రిమాండ్‌ రిపోర్టులో కూడా నా పాత్ర ఉందని ఎక్కడా సీఐడీ పేర్కొనలేదు’ అని చంద్రబాబు మరోసారి స్టేట్మెంట్ ఇచ్చారు.


వాదనలు విన్న తర్వాత మీరు కోర్టు హాల్‌లోనే ఉంటారా..? అని చంద్రబాబును న్యాయమూర్తి అడిగారు. అవును తాను కోర్టు హాల్‌లోనే ఉంటానని బాబు సమాధానమిచ్చారు. కోర్టు హాల్‌లోనే బాబు కూర్చుని ఉన్నారు. కాగా ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ కోర్టులోనే చంద్రబాబు ఉన్నారు. బాబును చూసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. ప్రస్తుతం చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. కోర్టు పరిధిలో ఇరు వర్గాల లాయర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సుమారు మూడు గంట‌లుగా వాదనలు కొనసాగుతున్నాయి. ఎవరి పాత్ర ఏంటి అనేది సీఐడీ తరఫు న్యాయవాదులు వినిపిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement