రాష్ట్రంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీకి ఆయన లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలపడం నేరమా? అని ప్రశ్నించారు. దెందులూరులో తహసీల్దార్‌కు వినతిపత్రమిచ్చి, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పా ? అని చంద్రబాబు నిలదీశారు. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసుల దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు. నిరసన ద్వారా అసమ్మతిని వ్యక్తం చేయడం చట్టవిరుద్ధమా అని ప్రశ్నించారు.
ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని, ఏపీలో వైసీపీ ప్రేరేపిత పోలీసు రాజ్యం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలతో ప్రజలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రాబోయే రోజులకు.. పోలీసుల ప్రస్తుత పనితీరు బ్లాక్ మార్క్‌గా ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు తగదని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏవైనా అసమ్మతులు ఉంటే వేధిస్తారా? అని ప్రశ్నించారు.
ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను పోలీస్ విభాగం వేధిస్తోందని, ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని చంద్రబాబు ఆ లేఖలో ఆరోపించారు. తప్పుడు కేసులతో నిర్బంధించి వేధిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలు, అరెస్టుల ద్వారా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా చర్యలు ఉంటున్నాయన్న చంద్రబాబు… ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మానుకుని, టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.