కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్తామంటే నిర్బంధిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే విషయం అందరికీ తెలిసిందేనని… గూగుల్ మ్యాప్స్ లో కూడా ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుందన్నారు. గ్రీన్ ట్రైబ్యునల్ కూడా అక్రమ మైనింగ్ జరుగుతోందని స్పష్టం చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లి వస్తున్న దేవినేని ఉమపై వైసీపీ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. దాదాపు 9 గంటల పాటు ఉమ కారులోనే ఉన్నారని… అలాంటి వ్యక్తి కారులో నుంచే ఇతరులపై ఎలా దాడికి పాల్పడతారని ప్రశ్నించారు. కారులో ఉన్న ఆయన బయటున్న వారిని ఎలా దూషిస్తారని నిలదీశారు. ఉమపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా, తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఉమపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. జరిగిన ఘటన మొత్తాన్ని ప్రజలంతా గమనించారన్న చంద్రబాబు.. ఎస్సీలపై దాడిచేసినట్లు దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
అక్రమ మైనింగ్ జరగకపోతే టీడీపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు? చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రౌడీ, గూండాలు, నేరస్థుల రాజ్యముందా? అని నిలదీశారు. అక్రమ మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేస్తే ఎందుకు పోనివ్వరు? అని అడిగారు. దాడులకు టీడీపీ భయపడదని స్పష్టం చేశారు. టీడీపీతో పెట్టుకున్నవాళ్లు కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు హెచ్చరించారు. కొండపల్లి అక్రమ మైనింగ్ పై సీనియర్ అధికారుల కమిటీ నియమించి అక్కడ అక్రమ మైనింగ్ చేసే దోపిడీదారుల పై చర్యలు తీసుకొని, ప్రజా సంపదను కాపాడాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.