Sunday, November 24, 2024

AP : చంద్ర‌బాబు అంటే మోసాలు, వంచ‌న‌లే…జ‌గ‌న్

కశింకోట,మార్చి6(ప్రభ న్యూస్): చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో ‘వైఎస్సార్‌ చేయూత’ నాలుగో విడత నిధులను బటన్‌ నొక్కి సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉంది. 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశాం. అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించాం. వైఎస్సార్‌ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరింది. 14 రోజుల పాటు చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోంది’’ అని సీఎం జగన్‌ చెప్పారు.

చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చిన మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు.‘‘2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా?. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు. పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది. చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే. వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు. కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ బెంజ్‌కారు ఇస్తామంటారు. చంద్రబాబు, దత్త పుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారు. రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు’’ అంటూ సీఎం ఉద్ఘాటించారు.

- Advertisement -

గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏరోజు ఆలోచించలేదు. అక్క చెల్లెమ్మలకు చేయూతనిచ్చి చేయి పట్టుకుని నడపిస్తున్నాం. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించాం. అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు గర్వపడుతున్నా. 1,68,018 మంది అక్క చెల్లెమ్మలు కిరణా దుకాణాలు నడుపుతున్నారు. 3,80,466 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు కొన్నారు. 1,34,514 మంది గొర్రెలు, మేకలు పెంపకం చేస్తున్నారు. ఇప్పుడు 26,98,931 మందికి రూ.5,060 కోట్లు జమ చేస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.

వైఎస్సార్‌ చేయూత పథకంతో అందించిన మొత్తం రూ.19,189.60 కోట్లు. మనది మహిళా పక్షపాతి ప్రభుత్వం. అమ్మ ఒడి పథకంతో 53 లక్షల మంది తల్లులకు అండగా నిలిచిన ప్రభుత్వం మనది. పిల్లల చదువుల కోసం ఈ స్థాయిలో అండగా నిలిచిన ప్రభుత్వం మరెక్కడా లేదు. గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు. గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మలకు మేలు చేశాం. అక్కచెల్లెమ్మల పిల్లలు పెద్ద చదువులు చదివితేనే వారి తలరాతలు మారతాయి.
పిల్లల చదువులు కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలను మోసం చేసింది’’ అని సీఎం మండిపడ్డారు.

గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా? ఆలోచన చేయమని కోరుతున్నా. వైఎస్సార్‌ చేయూత లాంటి పథకాలు గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు?ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 58 నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశాం. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మార్చేశాం. చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75 వేలు ఇస్తున్నాం. వైఎస్సార్‌ చేయూతతో ప్రతి మహిళకు ఆర్థిక స్వాలంబన చేకూరింది’’ అని సీఎం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement