తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లవ్ గేమ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వన్ సైడ్ లవ్ మంచిది కాదని చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు ఒక యువకునికి చమత్కారంగా చెప్పాడు. టూ సైడ్ లవ్ అయితేనే నిలబడుతుందని టీడీపీ, జనసేన పొత్తుపై నవ్వుతూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఆ మాటలే ప్రత్యర్థి పార్టీల నేతలకు అస్త్రాలుగా మారాయి. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఒక కార్యకర్త చూచించగా… ఆ సందర్భంగా లవ్ గురించి బాబు చమత్కరించాడు.
జనసేనతో పొత్తు కావాలని టీడీపీ భావిస్తోంది. కానీ, జనసేన నుంచి అంతే స్పందన రావడంలేదని ఆయన చేసిన ’’వన్ సైడ్ లవ్‘‘ మాటల్లో దాగున్న రహస్యం. సరిగ్గా, ఇదే అంశంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రియాక్ట్ అయ్యారు. ఎవరినైనా చంద్రబాబు లవ్ చేస్తాడని సెటైర్ వేశాడు. కానీ, ఎక్కడ వదిలేస్తాడో.. తెలియదని రిటార్ట్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీని గత ఎన్నికల్లో లవ్ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీని ఏం చేశాడో చెప్పాలని క్వశ్చన్ చేశాడు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మానసికంగా ఏపీ ప్రజల్ని ఆ పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. అందుకు నిదర్శనంగా ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కొన్నిచోట్ల కలిసి పనిచేశాయి. పరస్పరం రాజకీయ సహకారం కూడా అందించుకుంటున్నాయి. ఇటీవల టీడీపీ ఆఫీస్ లపై వైసీపీ కేడర్ దాడులు చేసింది. ఆ సందర్భంగా పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేనతో పొత్తు ఉంటుందని పొలిట్ బ్యూరో మెంటర్ షరీఫ్ ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు. మంగళగిరి జనసేన ఆఫీస్ లోకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వెళ్లాడు. ఇవన్నీ ఆ రెండు పార్టీలు మధ్య పొత్తు దిశగా సాగుతున్న కీలక అడుగులుగా పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోంది. కానీ, ఇరు పార్టీలు కలిసి ఒకే వేదికపైకి రాలేకపోతున్నాయి. తాజాగా జరిగిన ప్రజాగ్రహ సభకు జనసేన దూరంగా ఉంది. బద్వేల్ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి మద్ధతు ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ చేసిన నిరసన కార్యక్రమానికి బీజేపీ దూరంగా ఉంది. ఇట్లా.. ఆ రెండుపార్టీలు ఢిల్లీ వేదికగా ఒకేలా ఉన్నప్పటికీ ఏపీ కేంద్రంగా వేర్వేరుగానే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ లతో కలిసి జనసేన పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆకస్మాత్తుగా లెఫ్ట్ నుంచి రైట్ వైపు పవన్ అడుగులు వేశారు. కేంద్రంలోని బీజేపీ అజెండాను అందుకున్నారు. కానీ, ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి వస్తున్న సహకారం కూడా అంతంత మాత్రమే. దీంతో టీడీపీకి దగ్గర కావాలని ఆ పార్టీ అంతర్గతంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, బాహాటంగా టీడీపీ మాత్రం జనసేన పొత్తును కోరుకుంటోంది. అందుకే, వన్ సైడ్ లవ్ వద్దంటూ చంద్రబాబు మాటలే దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటున్నారు. మరి ఈ లవ్ మ్యాటర్‌ని టీడీపీ, జనసేనతో పాటు ఇతర పార్టీలు ఎక్కడిదాకా తీసుకెళ్తాయో తెలియాలంటే నెక్ట్స్ ఎలక్షన్ వరకు వెయిట్ చేయాల్సిందే..