Tuesday, November 26, 2024

చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్‌ స్కామ్‌.. సీఐడీ విచారణ జరుగుతోంది : మంత్రి బాలినేని..

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్ర‌ప్ర‌ధేశ్ ప్ర‌తిపక్ష నాయ‌కుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే రూ.333 కోట్ల ఫైబర్‌నెట్‌ స్కామ్‌ జరిగిందని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. సీఎం జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు సీఐడీ విచారణ జరుగుతోందని, దోషులు ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థలో అవినీతిపై వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సమాధానమిచ్చారు. టెండర్లలో ఐదు సంస్థలు పాల్గొన్నప్పటికీ చంద్రబాబు నాయుడు సన్నిహితుడైన వేమూరి హరి ప్రసాద్‌ ఎండీగా ఉన్న తెరా సాఫ్ట్‌వేర్‌ సంస్థకు కట్టబెట్టారన్నారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ ఒక రోజు ముందు పౌర సరఫరాల శాఖ పెట్టిన బ్లాక్‌ లిస్టు నుంచి తొలగించారన్నారు. పౌరసరఫరాల శాఖకు ఈ-పోస్‌ పరికరాల సరఫరాలో వైఫల్యం కారణంగా తెరా సాఫ్ట్‌వేర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టారన్నారు. బ్లాకు లిస్టు నుంచి తొలగించాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు 94 ప్రకారం స్పష్టమైన నిబంధనలు ఉన్నట్లు తెలిపారు. బ్లాకు లిస్టులో పెట్టిన అధికారి మాత్రమే తొలగించే అధికారం ఉందని, లేని పక్షంలో హైకోర్టుకు మాత్రమే తొలగించే అధికారం ఉందన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో దిగువస్థాయి అధికారి టెండర్లకు ఒక రోజు ముందు బ్లాకు లిస్టు నుంచి తొలగించారన్నారు. తొలి నుంచి ఇప్పటి వరకు కేవలం 20శాతం పనిమాత్రమే జరిగిందని చెప్పారు. ఇప్పటికే సీఐడీ విచారణ జరుగుతున్నందున దోషులను వదిలేది లేదంటూ మంత్రి బాలినేని స్పష్టం చేశారు.

తల్లివేరు లాంటిది..

వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఇతర కుంభకోణాలకు ఫైబర్‌ స్కామ్‌ తల్లివేరు లాంటిదన్నారు. 2015 జూలై 7న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి ఆగస్టు 7న క్లోజ్‌ చేశారన్నారు. తెరా సాఫ్ట్‌వేర్‌ సంస్థ కోసమే జూలై 31తో ముగించాల్సి ఉండగా మరో వారం పొడిగించారన్నారు. ఆగస్టు 12న తెరా సంస్థకు టెండర్‌ ఇచ్చిన ప్రభుత్వం..అదే నెల 26న సంస్థల ఎంపిక కోసం జీవో జారీ చేసిందన్నారు. ముగిసిన టెండర్లకు కమిటీ వేయడం తొలి ఉల్లంఘనగా వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు. విషయ తీవ్రత దృష్ట్యా వీలైనంత తొందరగా విచారణ ముగించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రభుత్వానికి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement