ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలి అడుగు పడింది. విజయవాడలోని ఏ-కన్వెన్షన్ వేదికగా ఇవాళ జరుగుతోన్న కూటమి శాసనసభాపక్ష సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ముందుగా కూటమి మూడు పార్టీ అధినేతలైన చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, ఎమ్మెల్యేలు అంతా వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు.
దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా తమ నాయకుడు చంద్రబాబేనని ముక్తకంఠంతో బలపరిచారు. అదేవిధంగా కూటమి తరఫున సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కూటమి ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు సంయుక్తంగా గవర్నర్కు పంపనున్నారు.