పేదలకు శత్రువు చంద్రబాబు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన లబ్ధిదారులు, ఏపీ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర సర్కార్ నిర్మిస్తోంది జగనన్న కాలనీలు కాదని.. ఏకంగా ఊర్లు కడుతున్నామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అధికారంలోకి వస్తే ఉచితంగా టిక్కడో ఇళ్లు కట్టిస్తామన్న హామీని నెరవేర్చామన్నారు. ఐదు లక్షల 52 వేల ఇళ్లు పూర్తయ్యాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 178 ఎకరాల్లో మరో 7,728 ఇళ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు. ఒక్కో లబ్ధిదారునికి ఇచ్చిన స్థలం విలువ రూ.2 నుంచి రూ.10 లక్షలు. పూర్తయిన ప్రతీ ఇంటి కోసం అయిన ఖర్చు రూ. 10 నుంచి 12 లక్షలు. ఇక నుంచి 16 వేలకు పైగా కుటుంబాలు ఈ టిడ్కో ఇళ్లలోనే ఉండబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 17 వేల కాలనీల నిర్మాణం జరుగుతోందని సీఎం జగన్ తెలియజేశారు.
ఇదే గుడివాడలో పేదలకు టిడ్కో ఇళ్లపై హామీ ఇచ్చా. ఇప్పుడు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోందన్నారు. కేవలం రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్లను అందిస్తోందన్నారు. ప్రతీ లబ్ధిదారునికి రూ.7 లక్షల ఆస్తిని ఉచితంగా ఇచ్చామన్నారు. అక్కచెల్లెమ్మల చేతిలో రూ. 6 నుంచి 15 లక్షల దాకా ఆస్తి పెట్టామన్నారు. 8,859 ఇళ్లకు అదనంగా జులై 7వ తేదీన మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం జగన్ తెలియజేశారు. తన వ్యాన్ ను చూసుకొని పవన్ కళ్యాణ్ మురిసిపోతున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. 175 స్థానాల్లో పార్టీ అభ్యర్ధులను పెట్టలేని వారు తమకు ప్రత్యర్ధులా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ జనసేనాని పవన్ కళ్యాణ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు దాటినా కూడ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్ధులు జనసేనకు లేరని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.చంద్రబాబు కోసం పుట్టానని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారన్నారు. తన జీవితమే చంద్రబాబు కోసమే త్యాగమని పవన్ కళ్యాణ్ మాట్లాడడాన్ని సీఎం జగన్ తప్పుబట్టారు.