శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 17 (ప్రభన్యూస్) : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకోవడంలో అర్థం ఉందని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారిలో తాను కూడా ఉన్నానని ఏపీ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంలోని కలెక్టరేట్ మినీ కాంగ్రెస్ హాల్లో పత్రికల వారితో ఇష్టాగోస్టిగా మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు ఆరోగ్యం మరీ అంబులెన్స్ లో తీసుకెళ్లే స్థితిలో లేదని, రాజకీయ ఆలోచనలు, ఒత్తిళ్లు వంటి అంశాలపై ఆలోచించినప్పుడు సహజంగానే బీపీ అధికం కావడం జరుగుతుందనేది అందరికీ తెలిసిందేనన్నారు. అంతమాత్రాన ఆయన పూర్తిగా ఆరోగ్యంగా లేరని చెప్పడం భావ్యం కాదన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు వినగానే చంద్రబాబుకు ఒక రకమైన టెన్షన్ మొదలవుతుందని వాస్తవం అన్నారు. కావున కొన్ని నెలలు రాజకీయాలు ఇతర అంశాలపైన ఆలోచించకుండా ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడిపి అనంతరం మళ్లీ రాజకీయాల గురించి ఆలోచించుకోవాలని కొమ్మినేని సూచించారు. అంతవరకు పార్టీ బాధ్యతలు కుటుంబ సభ్యులకు అప్పజెప్పితే బాగుంటుందని ఆయన అన్నారు.
ఖాద్రి నరసింహుని సన్నిధిలో కొమ్మినేని…
ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పాలకమండలి చైర్మన్ గోపాలకృష్ణ ఈవో శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ముఖ్యంగా ఆలయ చరిత్ర గురించి అర్చకులు కొమ్మినేని శ్రీనివాసరావుకు వివరించారు. శ్రీనివాసరావు వెంట సన్నీ వంశీకృష్ణ, తాసిల్దార్ సునీత, కదిరి మీడియా ప్రతినిధులు ఉన్నారు.