- బాధ్యతలు సరిగా నిర్వహించలేదని ఫైర్
- ఈవో శ్యామలరావుపై అసహనం
- తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన సిఎం
- హాస్పిటల్ లో క్షతగాత్రులకు పరామర్శ
- మృతుల కుటుంబాలను ఓదార్చిన చంద్రబాబు
- ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలుంటాయని వార్నింగ్
తిరుపతి – గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆ ఏడుకొండల వాడి సన్నిధిలో పెనువిషాదం చోటు చేసుకుంది. బైరాగిపట్టెడలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. 48మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో నేడు పర్యటించారు..
ముందుగా తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
ఈసందర్భంగా తితిదే ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. “భక్తుల రద్దీ పెరుగుతుంటే తితిదే అధికారులు ఏం చేస్తున్నారు ? ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి. తమాషా అనుకోవద్దు” అని వ్యాఖ్యానించారు.
బాధ్యత తీసుకున్నవారు వాటిని సక్రమంగా నెరవేర్చాలన్నారు చంద్రబాబు. ఎవరికీ నష్టం కలుగకుండా పద్దతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండంటూ అధికారులకు క్లాస్ పీకారు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ, అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 2వేల మందే పడతారు అనుకున్నప్పుడు.. 2500 మందిని లోపలికి ఎందుకు పంపించారని టిటిడి అధికారులను, పోలీసులను నిలదీశారు. భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందన్న అధికారులు.. బయటకు వదిలేటప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరణ ఇచ్చారు అధికారులు. ఇక బైరాగిపట్టెడ దగ్గర బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్ ఎవరు..? ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగింది..? ఎక్కువ మంది ఉన్నప్పుడు గేట్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా..? అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.. నిర్వహణ వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్స్ ల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు.
బాధితులకు పరామర్శ..
గాయపడి రుయా, స్విమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శించారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.. అనంతరం మార్చురీ వద్ద మరణించిన బాధిత కుటుంబాలను ఓదార్చారు.. ఇది దురకష్టకరమైన ఘటన అంటూ పేర్కొన్నారు.. ఈ కష్ట సమయంలో ప్రభుత్వం అంతా తోడుగా ఉంటుందని వారికి చెప్పారు.
అనంతరం చంద్రబాబు ఈ ఘటనపై టిటిడి, పోలీస్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.. వైకుంఠ ఏకాదశి పది రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఏ చిన్న పొరపాటుకు తావివ్వవద్దని కోరారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.. సాధ్యమైనంత త్వరగా ఈ ఘటనపై తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు.
ఈ పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మినిస్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు, టిటిడి ఈవో శ్యామలరావు, డీఐజీ షిమోషి బాజ్పాయ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, పలువురు ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.