ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు (తమ్ముడు), రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం మధ్యాహ్నం నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా, శనివారం ఉదయం రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు.
ఢిల్లి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం తెలుసుకుని మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లి ఎన్నికల ప్రచారంలో ఎన్డిఏ పక్షాన ప్రచారానికి వెళ్లాల్సి ఉండగా సోదరుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఢిల్లి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని తన తమ్ముడి భౌతికకాయం చూసి బోరున విలపించారు. తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి కుమారులు నారా రోహిత్, గిరీశ్ లను అక్కన జేర్చుకుని ఓదార్చారు. తండ్రిని కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆ ఇద్దరు సోదరులకు పెదనాన్నగా ధైర్యం చెప్పారు.
దీనికి సంబంధించిన ఫొటోలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. కాగా, రామ్మూర్తినాయుడు భౌతికకాయానికి చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, సుజనా చౌదరి, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కూడా నివాళులు అర్పించారు.