Thursday, November 21, 2024

AP : చంద్ర‌బాబు మోస‌గాడు..అస్స‌లు నమ్మొద్దు..సీఎం జగన్

- Advertisement -

(ఆంధ్రప్రభ, ఒంగోలు బ్యూరో): 14 ఏళ్లు సీఎంగా పని చేశానని చంద్రబాబు చెబుతుంటారు… ఏ రోజైనా ఆయ‌న మీ గురించి ఆలోచించాడా? అని అవ్వా తాతాలను సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వెంకటాచలంలో ఆదివారం రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం సామాజిక పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలు సీఎంతో మాట్లాడారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయమే తమకు పెన్షన్ డబ్బులు అందేవని, చంద్రబాబు కారణంగా తాము ఇబ్బంది పడ్డామని లబ్ధిదారులు వాపోయారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, 2014లో చంద్రబాబు హామీలిచ్చి మోసం చేశాడని.. అందుకే మోసం చేసేవాళ్లను నమ్మొద్దని కోరుతున్నానని వివరించారు. చంద్రబాబు హామీల ఖర్చు లక్షా 40 వేల కోట్లు దాటిపోయిందని, అందరినీ మోసం చేసేందుకే ఇలాంటి హామీలు ఇస్తున్నారని, చంద్రబాబుకు ఓటు వేస్తే.. పులి నోట్లో తలపెట్టినట్టేఅన్నారు.

అప్పుడెంత .. ఇప్పుడెంత ?
‘‘అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేది మీకు గుర్తుందా.. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎంతమందికి వచ్చేది.. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు.. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి.. అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక.. అవ్వాతాతల ఆత్మ గౌరవం కోసం ఆలోచన చేశాను”అని సీఎం జగన్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ వ్యవస్థ తీసుకోచ్చామని, వలంటీర్లతో నేరుగా అవ్వాతాతల ఇంటికే పెన్షన్ పంపించామని చెప్పారు. 56 నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం 1వ తేదీ ఉదయమే పెన్షన్ అందిస్తున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం 66 లక్షల మందికి పైగా పెన్షన్ అందిస్తున్నామని, ఇవాళ రూ.3 వేల వరకూ పెన్షన్ ను పెంచామని తెలిపారు. అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించామని… కుల, మత, రాజకీయాలకు అతీతంగా పెన్షన్ ఇస్తున్నామని లబ్ధిదారులకు సీఎం జగన్ గుర్తు చేశారు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే అని, రూ.3 వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. నెలకు రూ. రెండు వేల కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామని, 58 నెలలుగా పెన్షన్ల కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. పేదలకు మంచి చేసే విషయంలో మీ బిడ్డతో పోటీపడే వారు దేశంలోనే లేరని సీఎం జగన్ చెప్పారు.

ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేవు
రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి చేరిపోయాయని జగన్ అన్నారు.​ విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చేశాయని, వీటిని మార్చేందుకు మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తునాడని తెలిపారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్తారని, ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారని వివరించారు. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తా అని హామీ ఇస్తాడు కానీ అది నెరవేర్చే ఆలోచన ఆయనకు లేదన్నారు. నెలకు 8 వేలు పెన్షన్ ఇస్తానని హామీలు ఇవ్వడమే కానీ అమలు చేయడని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పేరిట వల వేస్తాడన్నారు. ‘‘అందుకే అందరూ ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నా.. మీ బిడ్డకు అబద్దాలు చెప్పడం రాదు.. మోసాలు చేయలేడు, చంద్రబాబు కూటమిలా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పను, మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడంతే” అని ఉద్వేగంగా అన్నారు.

మాకు వలంటీర్లే కావాలి..
‘‘వలంటీర్లు మొన్నటి వరకూ పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇచ్చేవారు.. చంద్రబాబు చేసిన పనితో ఈ నెల పెన్షన్ కోసం ఇబ్బంది పడ్డాం, అక్కడకు వెళ్లండి, ఇక్కడకు వెళ్లండి అని మమ్మల్ని తిప్పారు. ఇంటి నుంచి బయటకు రాలేక ఎంతో ఇబ్బంది పడ్డాం. వారం రోజుల తరువాత పంచాయతీ ఆఫీసులో ఇచ్చారు. అదే మాకు వలంటీర్ వ్యవస్థ ఉంటేనే మేలు జరుగుతుంది. చంద్రబాబు మాపై ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదు. పెన్షన్ అందకుండా చేసి ఆయన ఏం సాధిస్తాడు. వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. గతంలో చంద్రబాబు మనుషులకే పెన్షన్ వచ్చేవారు. జన్మభూమి కమిటీ సిఫార్పులు చేసిన వారికే పెన్షన్ వచ్చేది జగన్ పాలనలోనే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ వచ్చింది.” అని సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు ఘోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement