Friday, November 22, 2024

ప్రత్యేకహోదా కోసం రాజీనామాకు సిద్ధమా?: జగన్ కు చంద్రబాబు సవాల్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మభ్యపెడతారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రకటించిందని.. వైసీపీ ఎంపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని.. అలా చేయని పక్షంలో రాజీనమా చేస్తామని సీఎం జగన్ గతంలో చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. నాడు ప్రజలు, యువతకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోదా కోసం తమ పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని ప్రకటించారు. ప్రత్యేకహోదా కోసం కలిసి పోరాడేందుకు సిద్ధమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారని తీవ్రంగా ధ్వజమెత్తారు. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్‌.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్‌ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ.. రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా రాష్ట్రాన్ని పాలిస్తారని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జగన్‌.. ఇప్పుడు మౌనమెందుకు వహిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement