Sunday, November 24, 2024

Chandrababu – ఉద్య‌మ స్ఫూర్తితో క‌లసిక‌ట్టుగా ప‌ని చేశాం – వ‌ర‌ద బాధితుల‌ను అన్ని విధాల ఆదుకున్నాం


అంద‌రి స‌మీష్టి కృషితోనే ఇది సాధ్య‌మైంది
ఏకంగా రూ 400 కోట్లు దాత‌లు విరాళాలిచ్చారు
ఇప్ప‌టి వ‌ర‌కు బాధితుల‌కు రూ.602 కోట్లు సాయం చేశాం
వ‌ర‌ద‌ల వ‌ల్ల రూ.6వేల కోట్ల న‌ష్టం.. 47 మంది మృతి
బాధిత ఒక్కొ కుటుంబానికి రూ 25 వేల సాయం
న‌ష్ట‌ప‌రిహారం సొమ్మును ఖాతాల‌లో జ‌మ చేసిన చంద్ర‌బాబు

అమరావతి: వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ కలెక్టరేట్ లో నేడు జ‌రిగిన వ‌ర‌ద బాదితుల‌కు న‌గ‌దు సాయం పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం తన చేతుల మీదగా పలువురికి నష్టపరిహారం అందజేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేరుగా నష్టపరిహారం సొమ్మును చంద్రబాబు బాధితుల ఖాతాల్లో జమచేశారు.

- Advertisement -

అనంత‌రం జరిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, వరద సహాయక కార్యక్రమాలలోనే ఎక్కువ సమయం వెచ్చించానని అన్నారు. రూ. 400 వందల కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి వచ్చాయని.. వరద సహాయ కార్యక్రమంలో అధికారులు మంత్రులు ఒక స్పిరిట్‌తో పనిచేశారని చెప్పారు. ఇంత పెద్ద ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది 10 -11 రోజుల పాటు నిర్విరామంగా పని చేశారని చంద్రబాబు కొనియాడారు. వరద నీటిలో ఉన్న బాధితులకు అన్ని రకాలుగా సాయం అందించే ప్రయత్నం చేశామన్నారు. ఇంత పెద్ద విపత్తులో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటాయని, ఆఖరు బాధితుడికి కూడా సాయం అందలన్నదే తమ లక్ష్యమని సీఎం వ్యాఖ్యానించారు.

“పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగాం. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే.. మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి
బయటపడగలిగాం. విరాళాల కోసం రాష్ట్రప్రజలంతా బ్రహ్మాండంగా స్పందించారు. వరద బాధితులకు సాయం చేద్దామని పిలుపునిస్తే అంతా ముందుకొచ్చారు అని అన్నారు

బాధితులకు రూ.602 కోట్లు విడుదల

ఇప్పటివరకు రూ.400 కోట్ల మేర సీఎం సహాయ నిధికి డబ్బులు వచ్చాయి. చిన్నా పెద్దా అందరూ స్పందించారు. సంఘటితంగా ఉంటే ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కొంటాం. రూ. 602 కోట్లు ఇప్పటివరకు బాధితులకు విడుదల చేశాం. ఇందులో రూ.400 కోట్లు దాతలు ఇచ్చినవే. మొత్తం నష్టం రూ.6,800 కోట్ల మేర జరిగింది. 16 జిల్లాలు ప్రభావితం అయ్యాయి. మొత్తం 4 లక్షల మందికి ఆర్ధిక సాయం అందించాం. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కిరాణ దుకాణాలు, తోపుడు బండ్లకు సహాయం చేస్తున్నాం. నష్టపోయిన పంటలకు సాయం అందిస్తున్నాం. ఇళ్లు మునిగిన వారికి రూ.25 వేలు చొప్పున, మొదటి అంతస్తులో ఉన్న వారికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం చేశాం” అని చంద్రబాబు తెలిపారు.

రికార్డ్ స్థాయిలో బుడ‌మేరుకు వ‌ర‌ద

బుడమేరుతో పాటు ప్రకాశం బ్యారేజీకి ఈస్థాయిలో వరద ఎప్పుడూ రాలేదు. 11.90 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద సామర్థ్యం ఉంటే 11.47 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో విజయవాడ వరద ముంపునకు కారణమైంది. కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేసి పరిస్థితి పర్యవేక్షించా. మొట్టమొదటిగా సింగ్ నగర్ వెళ్లి పరిస్థితి పరిశీలించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి బోట్లు, హెలికాప్టర్లు తెప్పించాం. పెద్ద సంఖ్యలో ఆహార పొట్లాలు, నీటి బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశాం. సహాయక చర్యల్లో 780 పొక్లెయిన్లు పని చేశాయి. 75 వేల ఇళ్లను, 331 కిలోమీటర్ల మేర రహదారులను ఫైర్ ఇంజిన్లు శుభ్రపరిచాయి. మొత్తం వర్షాలు, వరదల కారణంగా 47 మంది మృతి చెందారు. ఈ విప‌త్తును అంద‌రి స‌హ‌కారంతో ఎదుర్కొన్నాం.. ప్ర‌స్తుతం అంద‌రికి సాయం అంద‌జేస్తున్నాం అని అన్నారు చంద్ర‌బాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement