Thursday, November 21, 2024

AP: ఏపీపీఎస్సీలో అక్ర‌మాలు… సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్

తాడేప‌ల్లి – ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీస్ కమిషన్ ను సీఎం జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశార‌ని చంద్రబాబు మండిపడ్డారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఏపీపీఎస్సీ పెద్దలు కోర్టును సైతం మోసగించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు.

అంతేకాకుండా..’రాజకీయ మూల్యాంకనంతో నిరుద్యోగుల గొంతుకోశారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థల విధ్వంసానికి ఏపీపీఎస్సీ కూడా బలైంది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ ను కూడా రాజకీయ లబ్ధికి, అక్రమాలకు వేదిక చేశారు. లక్షల మంది నిరుద్యోగుల నోట్లో సిఎం జగన్ మట్టికొట్టారు. ఎపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో ప్రభుత్వ పెద్దల వైఫల్యాలు, కుట్రలకు నిరుద్యోగ యువత బలైంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో మునుపెన్నడూ లేని వివాదాలు ఎందుకు తలెత్తాయి.

డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ మూల్యాంకన అంటూ మోసపూరిత చర్యలతో రాజకీయ మూల్యాంకనంకు పాల్పడ్డారు. తమ వారిని పోస్టింగుల్లో కూర్చోబెట్టుకునేందుకు గ్రూప్ 1 పోస్టులను అమ్ముకుని అర్హులైన వారికి అన్యాయం చేశారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అక్రమాలకు పాల్పడి సర్వీస్ కమిషన్ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బ తీశారు. లక్షల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని, వారి ఆశలను జగన్ ప్రభుత్వం నాశనం చేసింది.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement