ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వాలంటీర్లకు కీలక హామీ ఇచ్చారు. ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా ఇవాళ ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇస్తున్నానన్నారు. వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇచ్చే బాధ్యత మాదని ప్రకటించారు.
ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని.. ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థను తొలగించబోమని బాబు తేల్చి చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని సీఎం జగన్ చేస్తోన్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని వాలంటీర్లకు సూచించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమే కూటమి ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమిగా వస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతో అవసరమని చెప్పారు.